విద్యానగర్, మే 7: వైద్య రంగంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సీఎం కేసీఆర్ కలలు గన్న ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా కృషి చేస్తానని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డా.చెన్నాడి అమిత్‌కుమార్ పేర్కొన్నారు. టీఎస్ఎంసీ సభ్యుడిగా శనివారం ఆయన హైదరాబాద్‌లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం డా. అమిత్‌కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి తోడ్పాటునందిస్తానని తెలిపారు. ఇప్పటికే వైద్య రంగంలో గత కొన్నేళ్లుగా పేద, మధ్య తరగతి ప్రజలకు సేవలందిస్తున్నట్లు స్పష్టం చేశారు. నగర శివారులోని ప్రతిమ దవాఖానలో చిన్న పిల్లల విభాగం హెచ్వోడీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇప్పటి వరకు వేలాది మంది పిల్లలకు వైద్య సేవలందించినట్లు వెల్లడించారు. ప్రధానంగా తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఉచిత సేవలందిస్తున్నట్లు, వీరికి ప్రతినెలా రక్తం అవసరమున్న నేపథ్యంలో గత 12 ఏళ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో కూడా ప్రచారం చేపడుతూ, చైతన్యం తెస్తున్నట్లు చెప్పారు. యూకే వైద్య బృందంతో ప్రతి ఏడాది చిన్న పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహిస్తూ, వారికి కొత్త జీవితాలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 106 మంది చిన్న పిల్లలకు ఆపరేషన్లు చేసినట్లు పేర్కొన్నారు. చెన్నాడి దవాఖాన ద్వారా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, పేదలకు ఉచిత వైద్యసేవలందిస్తున్నట్లు తెలిపారు. తాను గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను సీఎం కేసీఆర్ గుర్తించి స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.