కమాన్‌చౌరస్తా, మే 6 : సెక్యూరిటీ గార్డు దొంగగా మారగా, పోలీసులు పథకం ప్రకారం పట్టుకుని నగదు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను టూటౌన్ సీఐ టీ లక్ష్మీబాబు వివరించారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ దవాఖాన, మాతా శిశు హాస్పిటల్లలో కొన్ని రోజుల క్రితం నుంచి తరచూ సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ల దొంగతనాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో పాటు, మే 3న కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో పనిచేసే స్టాఫ్ నర్స్ తన టీవీఎస్ జూపిటర్ వాహనాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసినారని టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ టీ లక్ష్మీబాబు, స్టేషన్ ఎస్ఐలు నరేశ్, మహేశ్, రవీందర్ నాయుడు, క్రైమ్ టీం సిబ్బంది జ్ఞానేశ్వర్, మల్లయ్య, రవీందర్ ఇతర సిబ్బందితో కొన్ని బృందాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ దవాఖాన, మాతా శిశు దవాఖానలో నిఘా ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో వావిలాలపల్లిలో నివాసముంటున్న రామడుగు మండలం దేశరాజ్‌పల్లికి చెందిన వేముల సంపత్ కుమార్ ప్రభుత్వ దవాఖానలో ఒక సర్వీస్ ద్వారా పేషెంట్ కేర్‌గా కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తూ దొంగతనాలు చేస్తున్నాడని పోలీసులు అనుమానించి, అత్యంత చాకచక్యంగా పట్టుకుని విచారించారు. దీంతో మే 3న దొంగిలించిన టీవీఎస్ జూపిటర్ బండితో పాటు గత సంవత్సరం అక్టోబర్‌లో కూడా మరొక టీవీఎస్ జుపిటర్ బండిని కూడా దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు. అతని దగ్గర నుంచి ఆ రెండు వాహనాలను, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే, ఈ సెల్ ఫోన్ల యజమానులను గుర్తించడంతో పాటు నేరస్తుడు గతంలో ఇంకా ఏమైనా నేరాలు చేశాడా? అని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నేరస్తుడిని అత్యంత చాక చక్యంగా పట్టుకొన్న కరీంనగర్ టూ టౌన్ పోలీసులను జిల్లా పోలీస్ కమిషనర్, టౌన్ ఏసీపీ అభినందించి, వారికి తగిన రివార్డులు కూడా ఇస్తామని తెలిపారు.