చిగురుమామిడి, ఆగస్టు 22: వానకాలం అనుకూల వర్షాలు కురుస్తుండడంతో రైతులు వరి నాట్లు వేయడంతోపాటు అదనపు ఆదాయంపై దృష్టి సారిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మొకలను పొలం గట్లపై నాటుతున్నారు. మొక్కల నిర్వహణ కోసం ప్రభుత్వం ఉపాధిహామీ కింద డబ్బులు కూడా చెల్లిస్తున్నది. దీంతో చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతులను ప్రోత్సహిస్తున్నది.
8వేల మొక్కలకు దరఖాస్తులు..
మండలంలోని అన్ని గ్రామాల్లోని రైతులు 8వేల మొకల కోసం రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 5వేలకు పైగా మొకలు పొలం గట్లపై నాటారు. ఎకువగా నవాబుపేట్, ఇందుర్తి గ్రామాలకు చెందిన రైతులు టేకు మొకలు నాటేందుకు ఆసక్తి చూపించారు. సాధారణ పంటలతోపాటు అదనపు ఆదాయం వచ్చే మొకలు పెంచేలా ప్రభుత్వం హరితహారం ద్వారా ఉచితంగా టేకు మొకలు ఇవ్వడంతోపాటు ఈజీఎస్ కింద గుంతలు తవ్వినందుకు, వాటి సంరక్షణకు డబ్బులు ఇస్తున్నది. గ్రామపంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన నర్సరీలతోపాటు అటవీనర్సరీల్లో పండ్లు, టేకు, వెదురు మొకలు అందుబాటులో ఉన్నాయి. పొలాల వద్ద ఖాళీ స్థలం ఎక్కువుగా ఉంటే టేకుతో పాటు జామ, మామిడి, సపోటా, సీతాఫలం మొకలు నాటుకునే అవకాశమున్నది. ఇందులో అంతర పంటలు సాగు చేసుకునే వీలుంది.
నిర్వహణ ఖర్చుల చెల్లింపు ఇలా..
వ్యవసాయ భూముల వద్ద మొకలు నాటే రైతులకు ప్రభుత్వం నిర్వహణ ఖర్చులు కూడా ఇస్తున్నది. నెలకు ఒక్కో మొకకు రూ.5చొప్పున ఈజీఎస్ ద్వారా చెల్లిస్తున్నది. మండలంలో ఇప్పటివరకు 5వేలకు పైగా టేకు మొ కలను రైతులు నాటినట్లు అధికారులు చెబుతున్నారు.
రైతులను ప్రోత్సహిస్తున్నాం
మండలంలో 8 వేల మంది దరఖాస్తు చేసుకోగా 5 వేలకు పైగా వివిధ గ్రామాలకు చెందిన రైతులు టేకు మొకలను తీసుకువెళ్లారు. వారి వ్యవసాయ పొలాల వద్ద గుంతలు తవ్వి నాటారు. వీటి సంరక్షణకు ప్రభుత్వం రైతుకు నగదును అందజేస్తున్నది. ఎకువ సంఖ్యలో టేకు మొకలను నాటేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నాం.