జమ్మికుంట, మే 4: అర్హులందరికీ ‘దళిత బంధు’ను అమలు చేస్తున్నామని, పథకాన్ని దళితులంతా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కర్ణన్ సూచించారు. పథకం ద్వారా రూ.10లక్షలు పొందిన లబ్ధిదారులంతా ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. పెండింగ్లో ఉన్న యూనిట్లన్నీ దశలవారీగా గ్రౌండింగ్ పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం కలెక్టర్ జమ్మికుంట మున్సిపల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, తదితరులతో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన, దళిత బంధు లబ్ధిదారులైన పొట్యాల అమృతమ్మ(వెంకటేశ్వర్లపల్లి) ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జి, సంకెనపల్లి లక్ష్మి(విలాసాగర్) స్వీట్స్, బేకరీ, వానరాసి ఆండాల్(వెంకటేశ్వర్లపల్లి) ఫర్నిచర్ షాపు, దొగ్గల శైలజ(వెంకటేశ్వర్లపల్లి) జిమ్ సెంటర్, శ్రీరాం లక్ష్మి(ఆబాది) మొబైల్ టిఫిన్ సెంటర్ యూనిట్లను పరిశీలించారు.
పనితీరును అడిగి తెలుసుకున్నారు. వినూత్న యూనిట్ల ఎంపికపై లబ్ధిదారులను అభినందించారు. యూనిట్లను కష్టపడి రన్ చేయాలని ప్రోత్సహించారు. బేకరీలో బేకరీ, స్వీట్లను కొనుగోలు చేసి వినియోగదారుడిగా మారిన కలెక్టర్, నిర్వాహకుడికి రూ.500 అందించారు. అందరికీ తినిపించారు. బేకరీ ఐటెం బాగుందని ప్రశంసించారు. నాణ్యతా, నమ్మకమే పెట్టుబడిగా ముందుకు సాగాలని యూనిట్దారులకు సూచించారు. తర్వాత ఆయన మాట్లాడారు. దళిత బంధు పథకం అద్భుతంగా ఉందని, అర్హులైన దళితులకు దళిత బంధు యూనిట్లు ఇప్పటి వరకు 70శాతం గ్రౌండింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. త్వరలో గ్రౌండింగ్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
దళిత బంధు దేశానికే ఆదర్శం: ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, జడ్పీ చైర్పర్సన్
దళితులను ధనికులుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్ కలని, సర్కారు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాం శ్యాం కొనియాడారు. జమ్మికుంటలో దళిత బంధు యూనిట్ల పనితీరును పరిశీలించిన తర్వాత వారు మాట్లాడారు. బ్యాంకు గ్యారంటీ లేకుండా, పైసా తిరిగి కట్టకుండా దళిత బంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికీ రూ.10లక్షలను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడాలేదని, దళితులంతా ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో కల్పన, తహసీల్దార్ రాజారెడ్డి, ఎంపీవో సతీశ్రావు, లబ్ధిదారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇబ్బందులుంటే మా దృష్టికి తీసుకురండి
హుజూరాబాద్ రూరల్, మే 4: దళిత బంధు యూనిట్లలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం మండలంలోని రంగాపూర్ గ్రామంలో దళిత బంధు యూనిట్లను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఎంపిక చేసుకున్న యూనిట్లపై లబ్ధిదారులకు ఉన్న అవగాహన గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించి లాభాలు ఆర్జించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రాంరెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో జయశ్రీతో పాటు తదితరులున్నారు.