జగిత్యాల, మే 4 (నమస్తే తెలంగాణ): వైద్యరంగంలో తెలంగాణ ముందంజలో ఉందని, స్వరాష్ట్రంలో సకల సౌకర్యాలతో సర్కారు వైద్యం అందుతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. గత 75 ఏండ్లలో రాష్ట్రంలో సమైక్య ప్రభుత్వాలు మూడంటే మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. కేసీఆర్ సర్కారు ఏడేండ్ల పాలనలో ఏకంగా 33 వైద్యకళాశాలలు ఏర్పాటు చేసిందని, ఇది మా పనితీరుకు నిదర్శనమని చెప్పారు. బుధవారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ దవాఖాన, మాతాశిశు సంరక్షణ కేంద్రాలకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. జగిత్యాలలో ప్రసవాల సంఖ్య రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉందని, పెంపుదలకు యంత్రాంగం కృషిచేయాలని పిలుపునిచ్చారు. ముహూర్తపు ప్రసవాలు మూర్ఖత్వానికి పరాకాష్ట అని, సాధారణ ప్రసవాలే తల్లీబిడ్డకు క్షేమదాయకమన్నారు. నార్మల్ డెలివరీ చేయిస్తే వైద్య సిబ్బందికి ఇన్సెంటివ్ ఇప్పిస్తానని ప్రకటించిన ఆయన, డాక్టర్లు మందులు బయటికి రాస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెంచడమే లక్ష్యంగా జిల్లా వైద్య సిబ్బంది పనిచేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో 23 కోట్లతో నిర్మించిన మాతా శిశు కేంద్రం, 260 పడకల జనరల్ హాస్పిటల్‌ను బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించా రు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. వైద్యరంగంలో తెలంగాణ అగ్రస్థానంవైపు పయనిస్తున్నదని చెప్పారు. టీఆర్ఎస్ సర్కారు ఏడేండ్ల పాలనలో ఏకంగా 33 వైద్యకళాశాలు, 102 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. కరోనా సమయంలో అత్యుత్తమ సేవలందించిన ఆశ, ఏఎన్ఎం, వైద్యులందరూ అభినందనీయులన్నారు. ఆరోగ్య సిబ్బంది చేపట్టిన ఇంటింటికీ ఆరోగ్య సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఈ సర్వే వల్ల దవాఖానల మీద లోడ్ తగ్గిందని, ప్రజలకు ఆందోళన తీరిందన్నారు. నీతి అయోగ్ సంస్థ సైతం దీన్ని గుర్తించి అభినందించిందన్నారు.
ప్రసవాల సంఖ్య పెంచాలి
జగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 44 శాతం మాత్రమే ఉందని, ఇది సరికాదన్నారు. కేసీఆర్ కిట్ వచ్చాక సైతం 56 శాతం మంది ప్రైవేటుకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. అద్భుతంగా 100 పడకల మాతాశిశు కేంద్రాన్ని జగిత్యాలలో ప్రారంభించుకున్నామని, ఇందులో 12 లేబర్ రూంలు, న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్, పిడియాట్రిక్ కేర్ సెంటర్ ఉంద ని, దీన్ని పేదలు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. తెలంగాణ రాక ముందు ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు 30 శాతం మాత్రమే అ య్యేవని, స్వరాష్ట్రంలో 56 శాతానికి పెరిగాయని, కానీ జగిత్యాలలో మాత్రం 14 శాతం మాత్రమే పెరుగుదల ఉందన్నారు.
ఈ వ్యవస్థ మారాలన్నారు. అనవసరంగా సీ సెక్షన్ ఆపరేషన్ వల్ల తల్లీబిడ్డలకు ఇబ్బందవుతున్నదని, ప్రపంచంలో ఎక్కడైనా సీ సెక్షన్లు కేవలం ముప్పై శాతం మాత్రమే ఉంటే జగిత్యాల జిల్లాలో 80 శాతం జరుగుతుం డడం బాధాకరమన్నారు. మూఢనమ్మకాలతో ముహూర్తం పెడితే పురుడు పోయడం సరికాదన్నారు. శాంతి హోమం, ఇంకా ఇతర గండాలు అని ప్రజలు భయపడి, పెట్టుడు ముహూర్తాల్లో సీ సెక్షన్ ప్రసవం చేయించేలా ఒత్తిడి తెస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారన్నారు. పెట్టుడు ముహూర్తం ప్రసవం మూర్ఖత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. రానున్న ఆరునెలల్లో జగిత్యాలలో సీ సెక్షన్ ప్రసవాలు 50 శాతానికి తగ్గేలా చూడాలన్నారు.
నార్మల్ డెలివరీ చేస్తే సీఎం అనుమతితో ఇన్సెంటివ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. అయ్యగార్లతో మాట్లాడి ముహూర్తాల గోల లేకుం డా చూడాలని, కలెక్టర్, ప్రజా ప్రతినిధులకు మం త్రి సూచించారు. జగిత్యాలలో డయాలసిస్ యూనిట్ పనిచేస్తున్నదని, ధర్మపురికి వారం క్రితం మంజూరు ఇచ్చామని, చొప్పదండి, కోరుట్లకు వచ్చే వారంలో మంజూరు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బాగా మాట్లాడుతున్నాడని, ఆయన హయాంలో కరీంనగర్ జిల్లాకు ఎందుకు మెడికల్ కాలేజీ రాలేదో.. ఎందుకు డయాలసిస్ కేంద్రాలు రాలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇదే కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వసంత మాట్లాడారు. పేదలకు మెరుగైన వైద్య సౌకర్యం కలిగిస్తున్న ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ప్రజలు రుణపడి ఉంటామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి మాట్లాడూతూ జగిత్యాల మెడికల్ హబ్‌గా ఏర్పడుతుందన్నారు.
అన్ని పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు పెడుతున్నాం. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి. ప్రతి నెల ఆశ కార్యకర్తలతో సమావేశం పెడుతాం. జగిత్యాలకు సీటీ సాన్ మిషన్ మంజూరు చేస్తున్నాం. జగిత్యాలలో టీ- డయాగ్నోస్టిక్ కేంద్రం ఏర్పాటు చేశాం. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. వైద్యులు బయటకు మందుచీటీలు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– మంత్రి హరీశ్‌రావు
విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం
ప్రజలకు అత్యంత కీలకమైన అంశాలు విద్య, వైద్యం. రాష్ట్ర సాధన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వాటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో 260 పడకల దవాఖానను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. త్వరలోనే మెడికల్ కాలేజీ ప్రారంభం కాబోతున్నది. ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో సైతం డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గొప్పవిషయం. దవాఖాన స్థాయిని యాభై పడకలకు పెంచారు. ధర్మపురిలో ఐసీయూ యూనిట్‌ను మంజూరు చేయాలి. మోకాలి చిప్పల మార్పిడి పెద్ద సమస్యగా మారింది. ఈ ఆపరేషన్లను సైతం ప్రభుత్వ దవాఖానల్లో చేసేలా చూడాలి.
– మంత్రి కొప్పుల ఈశ్వర్