కొత్తపల్లి/కరీంనగర్ రూరల్, మే 5 : కేంద్రం ధాన్యం కొనకపోగా.. రాష్ట్రంలో సజావుగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర పౌరసరఫరాల, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సర్కారు చేపడుతున్న కొనుగోళ్లను ఓర్వలేక బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, అడుగడుగునా కాళ్లలో కట్టే పెట్టే ప్రయత్నం చేస్తున్నదని, ఫిజికల్ వెరిఫికేషన్ పేరిట ఎఫ్‌సీఐతో కలిసి అడ్డుపుల్లలు పెడుతున్నదని మండిపడ్డారు. కొత్తపల్లి మండలం ఎలగందుల, చింతకుంట, కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్, మొగ్దుంపూర్, చెర్లభూత్కూర్, చామనపల్లి, నగునూర్ గ్రామాల్లో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం మంత్రి ప్రారంభించారు. దుర్శేడ్‌లో విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న కొనుగోళ్లు, ఏర్పాటు చేసిన కేంద్రా లు, డబ్బుల చెల్లింపుల వంటి వాటిపై శ్వేత పత్రం విడుదల చేశారు. ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే అని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా, ఆ మాటను పెడచెవిన పెట్టిందని ధ్వజమెత్తారు. పైగా రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదని నిసిగ్గుగా చెప్పడమే కాకుండా ‘నూకలు తినుండ్రి’ అంటూ అవహేళన చేసిందన్నారు. కేంద్రం కాదన్నా.. రైతు పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ 3వేల కోట్లు కేటాయించి కొనుగోలు చేస్తున్న తీరును కేంద్రం జీర్ణించుకోవడం లేదన్నారు. ఇది ఓర్వలేకే కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో మిల్లులకు ధాన్యం చేరవద్దనే ఫిజికల్ వెరిఫికేషన్ పేరిట తనిఖీల డ్రామాలకు తెరతీసిందని విమర్శించారు.
ఇది తనిఖీలు చేసే సమయం కాదని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రొక్యూర్మెంట్ నడుస్తున్నదని, కొనుగోళ్లు పూర్తయిన వెంటనే సంపూర్ణ సహకారం అందిస్తామని పదే పదే చెప్పినా వినకుండా దాడులకు పూనుకున్నదన్నారు. ఒక్కో రైస్‌మిల్లు వద్ద మూడు నాలుగు రోజులు తనిఖీలు చేయడం వల్ల ప్రస్తుతం కొన్న ధాన్యం దించుకోవడానికి సదరు మిల్లుల్లో వీలుపడడం లేదని, ఫలితంగా నిల్వలు పేరుకపోయి.. అన్నదాతలు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత పెంచి లబ్ధి పొందాలన్న రాజకీయకోణంలో బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుందని విమర్శించారు. నిజానికి ధాన్యం విషయంలో దాడులు చేయాల్సిన అవసరం లేదని, సదరు ధాన్యానికి కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదని, అందులో ఏమైనా అక్రమాలు జరిగితే అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని.. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే రైస్మిల్లర్స్పై చట్టపరంగా కేసులు పెట్టి రికవరీ చేస్తామని స్పష్టం చేశారు.
ఇది చాలదన్నట్లు కిషన్‌రెడ్డికి, బండి సంజ య్ పచ్చి అబద్ధాలడుతున్నారని విమర్శించారు. వారికి రైతుల సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు గన్నీ బ్యా గులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, ఎంపీపీలు పిల్లి శ్రీలత మహేశ్‌గౌడ్, తిప్పరి లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.