కార్పొరేషన్, మే 4: నగరాలు, పట్టణాల్లోంచి నిత్యం వెలువడుతున్న మురుగు నీరు నేరుగా సమీపంలోని నదులు, కాలువల్లో కలువడంతో అందులోని జలాలు కలుషితమవుతున్నాయి. భూమిలో ఇంకితే భూగర్భ జలాలు సైతం కలుషితమవుతాయని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పట్టణాలు, నగరాల్లోంచి వెలువడుతున్న మురుగు నీరు నేరుగా నదులు, కాలువల్లో కలువకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిసారించాయి. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అమృత్ పథకంలో ఈ సారి నీటి సంరక్షణ చర్యలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అమృత్ పథకం మొదటి విడుతలో మంచినీటి సరఫరా, పార్కుల అభివృద్ధికి నిధులు కేటాయించారు. రెండో విడుతలో మాత్రం మురుగు నీటి శుద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు.
ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన అమృత్ నగరాల్లో ఈ పనులకు ప్రాధాన్యమివ్వడంతో పాటు స్వచ్ఛ నగరాలు, పట్టణాలుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోనూ దీనికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా ఈ విషయంలోనూ బల్దియా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్ పట్టణం నుంచి వెలువడుతున్న మురుగు నీరు పూర్తిగా మానేరు నదిలోనే కలుస్తున్నది. ప్రస్తుతం మానేరు నదిపై మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఇప్పటికే డీపీఆర్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన పనులు కూడా అతి త్వరలోనే ప్రారంభించనున్నారు. దీంతో నగరంలోని మురుగు నీరు మానేరు నదిలోకి వదిలే అవకాశం లేకుండా పోతుంది. నగరంలోంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాతే వదలాల్సి ఉంటుంది. దీంతో నగరం నుంచి వచ్చే రెండు ప్రధాన మురుగు కాలువల చివరలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రతిపాదనలు సిద్ధం
నగరంలో ప్రస్తుతం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉండగా… అందులో సెప్టిక్ వ్యర్థాలు, బాత్రూం వ్యర్థాలను మాత్రమే శుద్ధీకరణ చేస్తున్నారు. దీనిని కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కాగా, ఇతర మురుగు నీరు సైడ్ డ్రైనేజీల నుంచి ప్రధాన మురుగు కాలువల ద్వారా లక్షల లీటర్లు నేరుగా మానేరు వాగులో కలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. ఈ క్రమంలో మానేరు నదిలో స్వచ్ఛమైన నీరు ఉండేలా నగరంలోని మురుగు నీరు మానేరు వాగులో కలువడానికి ముందే శుద్ధీకరణ కేంద్రాల్లో శుద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
ఈ విషయంలో కేంద్రం కూడా నిధులు మంజూరు చేస్తుండడంతో ఆ మేరకు ప్రణాళికలు తయారు చేయాలని ఇప్పటికే పాలకవర్గం ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రణాళికలు తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ విషయంలో ఇప్పటికే పలు ప్రతిపాదనలు సైతం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే 20 ఏళ్లలో నగరం నుంచి వెలువడే మురుగు నీటిని అంచనా వేసి, అందుకు అనుగుణంగా ఈ మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇలా శుద్ధి చేసిన నీటిని నగరంలోని మొక్కలు, నిర్మాణాలు, ఇతర అవసరాలకు వాడుకునే అవకాశం ఉంటుందని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. మురుగు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు పనులకు సంబంధించి చర్యలు వేగవంతం చేశారు. ఇవి పూర్తయితే మానేరు నదిలో మురుగు నీరు కలిసే అవకాశం ఉండదు.