నమస్తే కరీంనగర్ నెట్వర్క్, మే 4;అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి దంచికొట్టింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో పలు మండలాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. ప్రధానంగా కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కోతకు వచ్చిన పంట నేలకొరిగింది. మామిడికాయలు నేలరాలి.. మక్క జొన్న నేలకొరగగా, పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగి కిందపడ్డాయి. ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో షెడ్ల పై రేకులు లేచిపోయాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి చెందగా, ఇద్దరు కాపర్లకు గాయాలయ్యాయి.
ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం బీభత్స సృష్టించింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట, వీణవంక, చొప్పదండి, గంగాధర, తిమ్మాపూర్, జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. వరి, మక్క పంటలు నేలకొరిగాయి. మామిడికాయలు నేలరాలాయి. వీణవంక మండలంలో ఈదురు గాలులకు ఆయా చోట్ల చెట్లు విరుగగా, విద్యుత్ వైర్లు తెగి కిందపడ్డాయి. చొప్పదండి మండలంలోని మంగళపల్లిలో మక్కజొన్న పంట నేలకొరిగింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి, వెల్గటూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులకు ఇంటి పైకప్పలు ఎగిరిపోగా, రోడ్లపైన చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి, మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. కోరుట్ల మండలం సంగెం, చిన్నమెట్‌పల్లిలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. వరి, నువ్వుల పంటల నేలకొరిగాయి.
మల్యాల మండలం బల్వంతాపూర్‌లో పిడుగుపడి 42 గొర్రెలు మృతిచెందగా ఇద్దరు కాపర్లు, మరొకరికి గాయాలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మృతిచెందిన గొర్రెలను పరిశీలించడంతోపాటు గాయపడ్డ వారిని పరామర్శించారు. పెగడపల్లి మండలం బతికపల్లిలో కొప్పుల నర్సయ్యకు చెందిన ఇల్లు కూలిపోయింది. వెల్గటూర్ మండలం సంకెనపల్లి, పైడిపల్లి గ్రామాల్లో విద్యుత్ పోల్స్ విరిగిపోయి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిబ్బంది పోల్స్‌ను సరి చేసి విద్యుత్‌ను పునరుద్ధరించారు. పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో కేంద్రాలకు తెచ్చిన, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. కోతకు వచ్చిన వరి, మక్కజొన్న నేలవాలాయి.
సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో జొంగొని సదయ్యగౌడ్కు చెందిన రేకుల షెడ్‌పై కప్పు లేచిపోయి బిల్డింగ్‌పై పడడంతో గోడ కూలింది. ధర్మారం మండలం నరసింహుల పల్లి, బుచ్చయ్య పల్లి, కానంపల్లి గ్రామాల్లో ఏడు విద్యుత్ స్తంభాలు కింద పడ్డాయి. నరసింహులపల్లి కొనుగోలు కేంద్రం వద్ద విద్యుత్ తీగలు తెగి పడి తాతాలికంగా వేసిన రేకుల షెడ్డు ధ్వంసమైంది. బొట్లవనపర్తిలో రెడపాక నర్సయ్యకు చెందిన ఇంటి రేకులు లంక రాయమల్లు ఇంటిపై పడడంతో షెడ్డు ధ్వంసమైంది. రాయమల్లుకు స్వల్ప గాయాలయ్యాయి. రామయ్యపల్లిలో కొమ్ము లింగయ్య పూరిగుడిసె కూలిపోయింది. చింతలపల్లిలో కత్తెర శాల రవీందర్ ఇంటి వంటగది రేకులు ధ్వంసమయ్యాయి. ఎలిగేడు మండలంలో 452 ఎకరాల్లో వరికి నష్టం వాటిలిందని ఏఓ మేరుగు ఉమాపతి తెలిపారు. ఈదురుగాలులతో రామగుండం, ఎన్టీపీసీ పట్టణాల్లో రోడ్డుకు అడ్డంగా చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.