వేములవాడ, మే 3: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో విద్య, వైద్య సేవలు అందించడంలో దేశంలోనే మనమే నంబర్‌వన్ స్థానంలో ఉన్నామని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ దివ్యాంగులశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని మంగళవారం సతీసమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్-స్నేహలత దంపతులకు రాజన్న ఆలయంలో స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్, ఈవో రమాదేవి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. అనంతరం ఆలయ అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని, మౌలిక వసతుల కల్పనలో భాగంగా భవనాల మరమ్మతులు చేశామని, మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులు స్నానం చేయడం కోసం సోలార్ ద్వారా వేడినీళ్ల వసతి కల్పించామని చెప్పారు. గురుకుల విద్యాలయాల ద్వారా కార్పొరేట్‌స్థాయి విద్యను అందిస్తున్నామని, విద్య వ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు దీటుగా రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత పటిష్టం చేస్తున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. గుడిచెరువు, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణకు భూసేకరణ పూర్తయిందని తెలిపారు. యాదాద్రి తరహాలో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, జోగులాంబ, భద్రాది ఆలయాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం తిప్పాపూర్‌లో కొత్తగా నిర్మించిన శ్రీరాజరాజేశ్వరి ఫంక్షన్‌హాల్‌ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, ఎంపీపీ వజ్రమ్మ, జడ్పీటీసీ మ్యాకల రవితో కలిసి మంత్రి ప్రారంభించారు.
మంత్రికి ఘన సన్మానం
రాజన్న సన్నిధికి వచ్చిన మంత్రి ఈశ్వర్‌ను రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉపాధ్యాయుల చంద్రశేఖర్, గౌరవాధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు, కౌన్సిలర్లు సిరిగిరి రామ్‌చందర్, మారం కుమార్, జోగిని శంకర్ సన్మానించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, పట్టణాధ్యక్షుడు పుల్కం రాజు మంత్రి దంపతులకు మొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో జగిత్యాల జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, ఎంపీపీ బూర వజ్రమ్మ, జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రకాంత్, ఏఎంసీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, ఆలయ ఈవో రమాదేవి, కమిషనర్ శ్యామ్‌సుందర్ రావు, జడ్పీటీసీ మ్యాకల రవి, సెస్ డైరెక్టర్లు పొలాస నరేందర్, రేగులపాటి చరణ్ రావు, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, జోగిని శంకర్, సిరిగిరి రామ్ చందర్, యాచమనేని శ్రీనివాస్‌రావు, నరాల శేఖర్, వైస్ ఎంపీపీ ఆర్సీరావు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుల్కం రాజు, ఊరడి ప్రవీణ్, గోస్కుల రవి, నాయకులు న్యాలకొండ రాఘవ రెడ్డి, రామతీర్థపు రాజు, నీలం శేఖర్, టైలర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.