కొత్తపల్లి, మే 3: రైతాంగం మేలును కాంక్షించే తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు ముం దుకువచ్చిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. కేంద్రం సాకులు చూపుతూ కొనుగోలుపై చేతులెత్తిసి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లి, ఆసీఫ్‌నగర్, నాగులమల్యాల గ్రామాల్లో డీసీఎంఎస్, ఐకేపీ, పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించి మాట్లాడా రు. రైతులు పండించిన ప్రతిగింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలు, గిట్టనివారి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీబ్యాగులకు ఎలాంటి కొరతలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు నుంచి ఫిర్యాదు అందలేదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ప్రాజెక్టులు నిర్మించడం, 24 గంటల ఉచిత కరెంట్‌తో ధాన్యం దిగుబడి పెరిగిందన్నారు. రైతుల అభ్యున్నతికి కృషిచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు కండ్లమంటతో ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులను తరుగు పేరిట ఇబ్బందిపెట్టవద్దని అధికారులు, సెంటర్ల నిర్వాహకులకు సూచించారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు చేర్చాలన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్‌సీఐ ఫిజికల్ వెరిఫికేషన్ పేరిట రైస్ మిల్లులకు ధాన్యం తరలించకుండా అడ్డుకుంటుందన్నారు.
కొనుగోళ్లు పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియను చేపట్టాలని, రాష్ట్రం సైతం సహకరిస్తుందని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 249 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1373 మంది రైతుల నుంచి 8600 మెట్రిక్ టన్నులు సేకరించామని తెలిపా రు. మున్ముందు ఎలాంటి ఆటంకం లేకుండా చ ర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎం పీపీ పిల్లి శ్రీలత మహేశ్‌గౌడ్, జడ్పీటీసీ పిట్టల కరుణ, సర్పంచులు రాచమల్ల మధు, కడారి శాంత, నాయిని ప్రసాద్, ఎంపీడీవో ఏ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు దావ కమలామనోహర్, జడ్పీ కో ఆప్షన్ సాబీర్, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.