కమాన్‌చౌరస్తా, మే 3: జిల్లా వ్యాప్తంగా మంగళవారం దాన, ధర్మాల పండుగ రంజాన్‌ను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. నగరంలోని సాలెహ్నగర్ ఈద్గాతో పాటు పలు మసీదులు, ఈద్గాలు కిక్కిరిసి పోయాయి. ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పలువురు నాయకులు, ఇతర మతాల వారు సైతం ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి మతసామరస్యాన్ని చాటారు. సాలెహ్‌నగర్‌లో ముఫ్తీ మహ్మద్ ఘియాస్ మొహియొద్దీన్ సందేశమివ్వగా హఫీజ్ మనబతాఖాన్ ముస్లింలతో నమాజ్ చేయించారు. చింతకుంట ఈద్గాలో మహ్మద్ ఖైరొద్దీన్ సందేశమివ్వగా, ముఫ్త ఎత్తైమాదుల్ హక్ నమాజ్ చేయించారు.
పురాణి ఈద్గాలో ఖాజా అలీమొద్దీన్ నిజామీ సందేశమిచ్చి నమాజ్ చేయించారు. బైపాస్ రోడ్‌లోని ఈద్గాలో మహ్మద్ యూసుఫ్ సందేశమివ్వగా, మహ్మద్ యూనుస్ మదినీ నమాజ్ చేయించారు. సాలెహ్నగర్ ఈద్గా వద్ద ప్రార్థనల అనంతరం ముస్లింలకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్ సుధగోని మాధవీకృష్ణాగౌడ్, టీఆర్ఎస్ నాయకుడు చల్లా హరిశంకర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గాల వద్ద వైద్య, ఆరోగ్య, పోలీసు, ఫైర్, మున్సిపల్ శాఖల సిబ్బంది సేవలందించారు. వేడుకల్లో జమీయాతే ఐలే హదీప్ షహరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్, బాధ్యులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, మే 3: కరీంనగర్ రూరల్ మండలంలో ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థన చేశారు. నగునూర్‌లో ముస్లింలకు రూరల్ సీఐ విజ్ఞాన్‌రావు, ఎస్ఐ సిరిసిల్ల అశోక్, సర్పంచ్ ఉప్పు శ్రీధర్, ఉపసర్పంచ్ దామోదర్, నాయకులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో నగునూర్‌లో నెక్పాషా, ముజీబ్, రహీం, ఎండీ హఫీజ్, సయ్యద్ హఫీజ్, జావీద్, షాబీర్ హుస్సేన్, బొమ్మకల్‌లో నాయకులు వరాల శ్రీనివాస్, ర్యాకం మోహన్, తీగలగుట్టపల్లిలో ఆర్బీఎస్ మండల కన్వీనర్ కాశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.