వేములవాడ, మే 3: ప్రకృతితోనే మానవ మనుగడ ముడిపడి ఉందని ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర మున్నూరు కాపు సత్రంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు కూర విమల నటించి పాడిన తేనెటీగ పాట సీడీని మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మానవ జాతి మనుగడ కొనసాగాలంటే ప్రకృతిని కాపాడుకోవాలన్నారు. ప్రకృతితో ఉన్న బంధాన్ని తేనెటీగ పాట ద్వారా రచయిత కూర దేవేందర్ చక్కగా వివరించగా, విమల నటించి పాడారని అభినందించారు. అందరూ ఈ పాట చూసి మేల్కొనాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి విధ్వంసం జరిగినప్పుడు కవులు, కళాకారులు తమ ఆటపాటలతో ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం రచయిత కూర దేవేందర్ మాట్లాడుతూ, రైతులు పంట మార్పిడి విధానం అలవాటు చేసుకున్నప్పుడే ఆర్థికంగా బలపడుతారన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్, కవి వజ్జేల శివకుమార్, సీనియర్ జర్నలిస్ట్లు డాక్టర్ పృథ్వీరాజ్, కొడం పవన్ కుమార్, జెడల శ్రీనివాస్, మారం ప్రవీణ్, వంతడుపుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.