కరీంనగర్, మే 2 (నమస్తే తెలంగాణ) :ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కొలువుల జాతర మొదలైంది. గ్రూప్-1, పోలీస్ ఉద్యోగాలకు సోమవారం నుంచే దరఖాస్తుల ప్రక్రియకు తెరలేచింది. అయితే చాలా మంది అభ్యర్థుల్లో అవగాహన లేక ఆందోళన కనిపిస్తుంటుంది. ఏ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేయాలి? ఏ ఉద్యోగానికి ఏ అర్హతలుంటాయి? ఆన్లైన్ సెంటర్లోనే దరఖాస్తు చేసుకోవచ్చా? లేక మొబైల్ ఫోన్లోనూ అప్లయ్ చేసుకోవచ్చా? వంటి వివరాలు తెలియక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు ప్రక్రియపై నమస్తే ప్రత్యేక కథనం అందిస్తున్నది. ఉద్యోగార్థులూ మధ్యపేజీలో తెలుసుకోండి!
రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వడమే కాకుండా సోమవారం నుంచి గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నది. అయితే, ఏ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేయాలి, అర్హతలు వంటి వివరాలు తెలియక చాలా మంది అభ్యర్థులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలో ఒకసారి తెలుసుకుందాం.
ఓటీఆర్ తప్పనిసరి
గ్రూప్-1 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) తప్పనిసరని టీఎస్పీఎస్సీ స్పష్టం చేస్తోంది. ఇందుకు టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ https//www. tspsc.gov.in/లో అభ్యర్థులందరూ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు తమ ఓటీఆర్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. ఓటీఆర్ లేకుండా దరఖాస్తు చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. పాత ఓటీఆర్ ఉన్నవాళ్లు స్థానికత ఆధారంగా అప్డేట్ చేసుకుంటేనే అర్హులవుతారు. అభ్యర్థులు తమ ఓటీఆర్‌లో మొబైల్ ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీని సరి చూసుకోవాలి.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి
గ్రూప్-1 దరఖాస్తులు సోమవారం నుంచి మొదలు కాగా, ఈ నెల 31 అర్ధరాత్రి 11.59 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు లాగిన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. టీఎస్పీఎస్సీ మార్గదర్శకాల ప్రకారం వెబ్సైట్లో పలు స్టెప్స్ అప్లోడ్ చేసి పెట్టారు. దీని ప్రకారం..
స్టెప్– 1
ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ ఎంటర్ చేసి తమ ప్రొఫైల్‌కు లాగిన్ కావాలి.ఐడీ మరిచిపోతే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో know your tspsc-id లింక్‌పై క్లిక్ చేయాలి. తమ ఆధార్‌కార్డ్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి టీఎస్పీఎస్సీ ఐడీ నంబర్ తిరిగి పొందవచ్చు.
రిజిస్ట్రేషన్ చేసేటపుడు, పోస్టులకు దరఖాస్తు చేసేటపుడు అభ్యర్థులు తమ ఆధార్ కార్డ్, విద్యార్హతల సర్టిఫికెట్లు (ఎస్ఎస్సీ నుంచి డిగ్రీ వరకు) స్టడీ, బోనోఫైడ్ లేదా నివాస ధ్రువీకరణ, కులం సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్, దివ్యాంగులైతే వీటికి సంబంధించిన సాఫ్ట్ కాపీలను అప్లోడ్ చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంచుకోవాలి..
స్టెప్ -2
వెబ్సైట్లో ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి. టీఎస్పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ కావాలి. తర్వాత ఓటీఆర్ డేటాబేస్ నుంచి అభ్యర్థికి సంబంధించిన వివరాలు ప్రత్యక్షమవుతాయి. పుట్టిన తేదీ, విద్యార్హతలు, జెండర్, కులం, ఇతర అదనపు అర్హతలు ఇందులో కనిపిస్తాయి. ఓటీఆర్ డేటాబేస్ ఆధారంగా వచ్చిన వివరాలన్నీ సరిగ్గా ఉంటే ‘ఎస్’ అని, మార్చాల్సిన అవసరం ఉంటే ‘నో’ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఓటీఆర్ ఫాం ఓపెన్ అవుతుంది. అందులో కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు.
ఓటీఆర్ డాటాబేస్ నుంచి పొందిన వివరాలతోపాటు నోటిఫికేషన్లో నమోదు చేయాల్సిన వివరాలన్నీ అభ్యర్థులే జాగ్రత్తగా పూరించాలి. అన్ని వివరాలు తప్పనిసరిగా పూర్తి చేయాలి. అస్పష్టంగా, అసమగ్రంగా ఉన్న దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎగ్జామ్ సెంటర్ ఎంపిక, అవసరమైన అర్హతలు ఎంటర్ చేయడంతోపాటు డిక్లరేషన్ ఓకే చేయాలి. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత ప్రివ్యూ ఎడిట్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అక్కడ కూడా మరోసారి చెక్ చేసుకొని ‘సేవ్ అండ్ కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయితే ఆన్లైన్లో ఫీజు చెల్లించే గేట్ వే ఓపెన్ అవుతుంది.
స్టెప్ -3
అభ్యర్థులు నిర్ణీత ఫీజును ఆన్లైన్లోనే చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, టీ- వ్యాలెట్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
స్టెప్-4
ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ పీడీఎఫ్ జనరేట్ అవుతుంది. అభ్యర్థులు ఈ పీడీఎఫ్‌ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి. పీడీఎఫ్‌లోని రిఫరెన్స్ ఐడీ నంబర్ తదుపరి కరస్పాండెన్స్‌కు ఉపయోగపడుతుంది.
ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు..
ఈ ఉద్యోగాలకు కూడా సోమవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ నెల 20న రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు విధించారు. పోలీసు ఉద్యోగాలకు టీఎస్ఎల్పీఆర్బీ అఫిషియల్ వెబ్సైట్ https://www.tslprb.in/లో అభ్యర్థులు లాగినై తమ దరఖాస్తులను సమర్పించాలి. అభ్యర్థులు ముందుగా టీఎస్ఎల్పీఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి.
ఎస్ఎస్సీ మెమోలో ఉన్నట్టు పేరు, పుట్టిన తేదీ, జెండర్, కులం, తదితర వివరాలతో పాటు మొబైల్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలి. తర్వాత లాగిన్‌లోని వెళ్లి యూజర్ ఐడీగా మొబైల్ నంబర్‌ను, పాస్‌వర్డ్‌గా పుట్టిన తేదీని నమోదు చేయాలి. లాగిన్ కాగానే పోలీసు నియామక మండలి విడుదల చేసిన ఆరు నోటిఫికేషన్లు ప్రత్యక్షమవుతాయి. అందులో వివిధ భాగాలకు చెందిన పోస్టులు కనిపిస్తాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పోస్టులను ఎంచుకోవాలి.
నిర్ణయించిన పరీక్ష ఫీజును ఆన్లైన్లోనే చెల్లించాలి. అదే నంబర్ సహాయంతో పార్ట్-1కు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష ఏ భాషలో రాస్తారో ఎంపిక చేసుకోవాలి. 1 నుంచి 7వ తరగతి వరకు స్థానికత వివరాలను నమోదు చేయాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవాలి.
అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో సంతకంతో కూడిన ఫైల్‌ను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఒకసారి చెల్లించిన ఫీజును రీఫండ్ చేయబోమని పోలీసు శాఖ ప్రకటించింది.
అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు ఈసారి మారిన నిబంధనలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థుల విద్యార్హతలను ఈసారి మార్చారు. గతంలో కానిస్టేబుల్‌కు ఎస్సెస్సీ అర్హతగా, ఎస్ఐకి ఇంటర్మీడియట్ అర్హతగా ఉండేది. మిగతా వర్గాల వారికి కానిస్టేబుల్‌కు ఇంటర్, ఎస్ఐకి డిగ్రీ విద్యార్హతలు ఉండేవి. ఇప్పుడు అన్ని వర్గాలకు కానిస్టేబుల్‌కు ఇంటర్, ఎస్ఐ పోస్టులకు డిగ్రీ విద్యార్హతలుగా నిర్ణయించారు.
లోకల్ అభ్యర్థులు 1 నుంచి 7వ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా లోకల్ కేటగిరీగా పరిగణిస్తారు. అందుకు అభ్యర్థి చదివిన పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్లు సమర్పించాలి. ఎన్ని పాఠశాలల్లో చదివితే అన్ని ధ్రువపత్రాలు సమర్పించాలి. ఒక వేళ ఏ పాఠశాలలోనూ చదవకపోతే ఎన్నేళ్లు చదువలేదో అన్నేళ్లకు స్థానిక తహసీల్దార్ నుంచి నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. చదివిన తరగతులకు ఆయా పాఠశాలలకు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లను సమర్పించాలి. ఈ రెండింటినీ పరిశీలించిన తర్వాతనే అభ్యర్థుల స్థానికతను నిర్ధారిస్తారు. అయితే పాఠశాలలో చదివినా ఇతర ప్రాంతం నుంచి నివాస ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే స్థానికతను పరిగణించబోమని పోలీసు నియామక మండలి ప్రకటించింది. బీసీ అభ్యర్థులకు గతేడాది ఏప్రిల్ 1 తర్వాత పొందిన నాన్ క్రిమిలేయర్ ధ్రువపత్రం తప్పనిసరి అని పోలీసు నియామక మండలి పేర్కొంది.
ఎస్ఐ కావడమే లక్ష్యంగా కష్టపడుతున్నా
ఇన్ని రోజుల తర్వాత రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తున్నాయి. స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయడం సంతోషం. నేను ఎస్ఐ ఉద్యోగానికి అప్లయ్ చేస్తున్న. ఈ ఉద్యోగమే లక్ష్యంగా కష్ట పడుతున్నా. కానీ, అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న. ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగం సాధించకపోతే ఇక జీవితంలో ఉద్యోగం సాధించలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న చాలా ఉద్యోగాలు ఉన్నాయి.
–జే శ్రీలత, హౌసింగ్‌బోర్డు కాలనీ (కరీంనగర్)
మొదటి రోజే అప్లయ్ చేసుకున్నా..
గతంలో ఎన్నడూ లేనివిధంగా సర్కారు 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ ఉద్యోగం సాధించలేం. ఈసారి తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఉన్నా. అందుకే మొదటి రోజే అప్లయ్ చేసుకుంటున్నా. గ్రూప్-1 రాసి డిప్యూటీ కలెక్టర్ కావాలన్నది నా కల. నా కలను నెరవేర్చుకునేందుకు కొన్ని రోజులుగా కష్టపడి చదువుతున్నా. ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం నాలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి ఇన్ని పోస్టులకు నోటిఫికేషన్ వేయడం చాలా సంతోషంగా ఉంది.
– జిన్నారపు సమత, శివపల్లి, ఎలిగేడు మండలం (పెద్దపల్లి జిల్లా)