రాజన్న సిరిసిల్ల, మే 2 (నమస్తే తెలంగాణ);సిరిసిల్ల వస్ర్తోత్పత్తిదారులకు సర్కారు తీపికబురు అందించింది. కేంద్రం తీరుతో మూతపడ్డ టెక్స్టైల్ పార్కు పునఃప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. యారన్, వస్ర్తాలపై కలిపి 17 శాతం జీఎస్టీ విధింపు.. టఫ్ స్కీంలో 10శాతం సబ్సిడీ తగ్గింపుతో రెండ్రోజుల క్రితం ఆగిపోయిన మరమగ్గాల చప్పుడు నేటి నుంచి మళ్లీ మొదలుకాబోతున్నది. ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సబ్సిడీ రూ.14.66 కోట్ల చెల్లింపునకు మంత్రి కేటీఆర్ చొరవతో సర్కారు అంగీకారం తెలిపి.. తాజాగా జీవో విడుదలకు హామీ ఇవ్వగా, కార్మికలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది. సీఎం కేసీఆర్, అమాత్యుడు కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి జేజేలు పలుకుతున్నది.
దేశంలో వ్యవసాయం తర్వాత లక్షల మందికి ఉపాధి కల్పించే రంగం టెక్స్‌టైల్స్‌పై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తున్నది. వస్ర్తోత్పత్తులకు వినియోగించే నూలుపై 12 , ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడమే కాకుండా టెక్స్టైల్స్ అప్‌గ్రేడేషన్ ఫండ్(టప్) స్కీంలో ఇచ్చే 30శాతం సబ్సిడీని 10 శాతానికి తగ్గించింది. దీంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. చేనేతపై విధించిన పన్ను మాఫీ చేయాలని, సిరిసిల్లకు మెగాపవర్‌లూం క్లస్ట ర్ మంజూరు చేయాలని చేనేత జౌళిశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారు. రెండ్రోజుల క్రితం ఎంపీ బండి సంజయ్‌కు కూడా బహిరంగ లేఖ రాశారు. కేంద్రం విధానాలతో రాష్ట్రంలోని ఏకైక సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్కును యూనిట్లను నడిపించ లేక రెండ్రోజుల క్రితం యజమానులు పరిశ్రమను మూసి వేశారు.
మంత్రి కేటీఆర్ అభయం..
టెక్స్టైల్ పార్కు మూతతో వందలాది మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదాన్ని గుర్తించిన మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి పీఎస్ శ్రీనివాస్, చేనేత జౌళిశాఖ అధికారులను హుటాహుటిన సోమవారం సిరిసిల్లకు పంపించారు. సెస్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, చేనేత జౌళీశాఖ అధికారులు అశోక్‌రావు, సాగర్‌తో కలిసి పార్కు అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అన్నల్దాస్ అనిల్, ప్రధాన కార్యదర్శి కిరణ్, సభ్యులతో చర్చించారు. వారి డిమాండ్లను శ్రీనివాస్ కేటీఆర్‌కు ఫోన్ ద్వారా వివరించారు.
అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి పెండింగ్ కరెంటు రీయింబర్స్మెంట్ రూ.14.66 కోట్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. మరమగ్గాల ఆధునీకరణకు ప్రోత్సాహన్ని అందించాలని, టె స్కో ద్వారా వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లలో 25శాతం పార్కులోని యూనిట్లకు ఇవ్వాలని, త్రిఫ్ట్ పథకం వార్పర్లకు, జాఫర్‌లకు వర్తింప చేయాలని, ఎన్ఓసీ లాంటి వివిధ డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్తానని పీఎస్ కమిటీ సభ్యులకు సూచించడంతో నేటి నుంచి పార్కులో వస్త్ర ఉత్పత్తులు ప్రారంభిస్తున్నట్లు యజమానుల కమిటీ తెలిపింది.
యజమానులు, కార్మికుల్లో ఆనందం..
సమస్యలపై ప్రభుత్వం స్పందించిన నేపథ్యంలో యజమానులు టెక్స్టైల్స్ పార్కు ప్రధాన గేట్ వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశా రు. ఈ సందర్భంగా పార్కు అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అనిల్, అంకారపు కిరణ్ మాట్లాడుతూ మూసి వేసిన టెక్స్టైల్స్ పార్కును నేటి నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం విధానాల వల్లే టెక్స్టైల్స్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఆదుకోవడంతోనే నేడు టెక్స్టైల్స్ రంగం బతికిబట్ట కడుతుందన్నారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సంజయ్‌కు వినతిపత్రం పోస్టులో పంపినట్లు తెలిపారు. వస్త్ర ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీని రద్దు చేయాలని, టఫ్ స్కీంలో గతంలో మాదిరిగా 30 శాతం సబ్సిడీని కొనసాగించాలని, కేంద్ర పరిధిలోని ఈపీసీజీకి సంబంధించిన జరిమానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులను ఆ దుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంటే కేంద్రం మాత్రం కార్మికుల పొట్టగొట్టే విధంగా సుంకాలు వేయడం దుర్మార్గమన్నారు.