ధర్మారం, మే 2: స్వరాష్ట్రంలో గ్రామాల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ పుష్కలంగా నిధులు విడుదల చేస్తున్నారని, ‘పల్లెప్రగతి’తో పల్లెలు కళకళలాడుతున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ధర్మారం మండలంలో సోమవారం మంత్రి విస్తృతంగా పర్యటించారు. సుమారు రూ. కోటీ 82 లక్షల 50 వేల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ధర్మారంలో ‘మన ఊరు -మనబడి’ కార్యక్రమం కింద ఎంపికైన ప్రాథమిక పాఠశాలలో రూ. 27.50 లక్షల పనులకు, ఎర్రగుంటపల్లి శివారులో రూ. 5 లక్షలతో చేపట్టే ఆర్ఎంపీల సంఘ భవన నిర్మాణానికి, కటికెనపల్లిలో రూ. 1.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. మండుటెండలో ఆయన పర్యటించగా కటికెనపల్లిలో సర్పంచ్ కారుపాకల రాజయ్య, ఎంపీటీసీ సూరమల్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ రామడుగు గంగారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ఘన స్వాగతం పలికారు.
సుమారు 10 వీధుల్లో పర్యటించిన మంత్రి ఈశ్వర్ సీసీ రోడ్లను ప్రారంభించారు. రూ.15 లక్షలతో చేపట్టిన వైకుంఠధామం, రూ.5 లక్షలతో చేపట్టిన కంపోస్ట్ షెడ్డు, రూ.5 లక్షలతో చేపట్టిన జిమ్‌ను, పల్లె ప్రగతిలో రూ.10 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని నడి కూడలి భారత మాత విగ్రహం వద్ద నిర్వహించిన సభలో మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా నెల నెలా నిధులు విడుదల చేయడంతో పల్లె ప్రకృతి వనం, ఇతర అభివృద్ధి పనులతో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. సమైక్య పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారని, కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు.
నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిచారని సర్పంచ్ కారుపాకల రాజయ్యను మంత్రి అభినందించి శాలువాతో సత్కరించారు. గ్రామంలో మిగిలిపోయిన పనులకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్ఎంపీలకు అన్ని విధాలా సహకరిస్తామని, భవన నిర్మాణానికి మరో రూ.5 లక్షల నిధులు మంజూరు చేస్తామని, బోరు వేయిస్తామని హామీ ఇచ్చారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కటికెనపల్లిలో ఎస్సీ కాలనీలో మహిళలతో సమావేశమైన మంత్రి ఈశ్వర్ స్వయం ఉపాధి పనులు చేస్తే రుణ సాయం చేసి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ గ్రామంతో పాటు చామనపల్లి గ్రామంలో పలువురు బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు. కాగా, కటికెనపల్లి గ్రామంలో సర్పంచ్ కారుపాకల రాజయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ,ధర్మారం పూస్కూరు జితేందర్‌రావు, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ రాజమల్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.