చొప్పదండి, మే 2: రైతును రాజుగా చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగానే రైతు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్‌విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కాట్నపల్లిలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయానికి పెట్టుబడి నుంచి పంటల కొనుగోలు వరకు ప్రతి విషయంలోనూ రైతుకు అండగా ఉంటున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ దేనని చెప్పారు. దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని సూచించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. తాలు, పొల్లు లేకుండా ఎండబోసిన వరి ధాన్యాన్ని తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లింగంపల్లి లావణ్య, ఉప సర్పంచ్ ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, సహకార సంఘం ఉపాధ్యక్షుడు ముద్దం మహేశ్, డైరెక్టర్లు దుర్గం పద్మ, బండారి కొమురయ్య, నాయకులు గన్ను శ్రీనివాస్‌రెడ్డి, గన్ను రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
గంగాధర, మే 2: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, సర్పంచ్ కంకణాల విజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గట్టుభూత్కూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల ప్రారంభం
తిమ్మాపూర్ రూరల్, మే 2: నుస్తులాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ప్రజాప్రతిధులు, పాలకవర్గ సభ్యులు సోమవారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రామకృష్ణకాలనీ, ఇందిరానగర్, మక్తలపల్లి, బాలయ్యపల్లి, కొత్తపల్లి, గొల్లపల్లి, నేదునూర్, లక్ష్మీదేవిపల్లి, వచ్చునూర్, రామహనుమాన్నగర్, జూగుండ్ల గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి సొసైటీ పాలకవర్గ సభ్యులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా సొసైటీ పరిధిలోని గ్రామాల్లో ఎక్కడికక్కడే కేంద్రాలను ప్రారంభించినట్లు సొసైటీ చైర్మన్ అలువాల కోటి తెలిపారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గుజ్జుల రవీందర్‌రెడ్డి, సర్పంచులు ఇనుకొండ జితేందర్‌రెడ్డి, మీసాల అంజయ్య, వినోద, భాగ్య, వెంకటేశ్వర్రావు, ఎల్లయ్య, ఎంపీటీసీలు కొత్త తిరుపతిరెడ్డి, కిన్నెర సుజాత-సారయ్య, కొమురయ్య, సొసైటీ డైరెక్టర్లు బోయిని రజిత-తిరుపతి, నోముల తిరుపతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.