శంకరపట్నం, మే 2: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. తొలిపొద్దు పర్యటనలో భాగంగా వేకువజామునే మెట్పల్లి, లింగాపూర్, కొత్తగట్టు, కరీంపేట్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి బైక్‌పై లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ముస్లిం మహిళలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. స్వయంగా గ్రామస్తులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించారు.
చక్కెర కుడుకలతో సోదర భావాన్ని చాటుకున్న మహిళలు
కరీంపేట్ గ్రామంలో పలువురు మహిళలు ఎమ్మెల్యేపై సోదర భావాన్ని చాటుకున్నారు. సోమవారం జాతీయ అన్నదమ్ములు-అక్కాచెల్లెళ్ల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే రసమయికి చక్కెర కుడుకలు పోశారు. స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా రసమయి వారికి చీరలు పెట్టి సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉమ్మెంతల సరోజన, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ గూడూరి శ్రీనివాస్‌రావు, వైస్ ఎంపీపీ పులికోట రమేశ్, సర్పంచులు వంగల సరోజన, మొకిరాల కిషన్‌రావు, వీరారెడ్డి, సర్పంచుల ఫోరం చైర్మన్ పల్లె సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం చైర్మన్ పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు గాండ్ల తిరుపతయ్య, శోభారాణి, ఏఎంసీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, గిర్దావర్ లక్ష్మారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖాజా పాషా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, గుర్రం భాగ్యలక్ష్మి, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.