సిరిసిల్ల, మే 1: మారుమూల ప్రాంతాల్లో ఆర్థిక స్థోమత లేని నిరుద్యోగులు, ఉద్యోగార్థులకు ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్‌రావు అండగా నిలుస్తున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు తనవంతు చేయూతను అందిస్తున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకునే స్థోమత లేని నిరుపేద విద్యార్థులు, అభ్యర్థులకు వెన్నంటి ఉంటున్నారు. మంత్రి కేటీఆర్ కోచింగ్ సెంటర్ పేరిట శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణనిస్తూ వారి భవితకు బాటలు వేస్తున్నారు. తాజాగా సోమవారం నుంచి టెట్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు కూడా ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. పట్టణాల్లోని కోచింగ్ సెంటర్లకు దీటుగా ముస్తాబాద్‌లో మంత్రి కేటీఆర్ పేరిట ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అటు మంత్రి కేటీఆర్‌పై తనకున్న అభిమానాన్ని చాటుతూ ఇటు నిరుద్యోగులకు ప్రోత్సాహం అందిస్తున్నారు. పోటీ పరీక్షలకు శిక్షణనిస్తూనే ఉద్యోగ నియామకాల అర్హత పరీక్ష (టెట్)కు కూడా తాను ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు శరత్‌రావు ప్రకటించారు. సోమవారం నుంచి టెట్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్స్‌లో పోటీ పరీక్షల శిక్షణకు దాదాపు 150మంది విద్యార్థులు నిత్యం హాజరవుతున్నారు. ఈ శిక్షణతో పాటు టెట్‌కు ప్రిపేరయ్యే ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పించనున్నారు. కాగా, ఈ ఏడాది జూన్ 12న టెట్ అర్హత పరీక్ష నిర్వహించనుండగా పరీక్ష తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ముస్తాబాద్ మండలానికి చెందిన వారితో పాటు సమీప మండలాల్లో బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని శరత్‌రావు కోరారు.
నిష్ణాతులైన అధ్యాపకులు… ఉచిత భోజనం
టెట్ శిక్షణకు హాజరయ్యే వారికి ముస్తాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. టెట్ శిక్షణ కోసం హైదరాబాద్ నుంచి నిష్ణాతులైన ఫ్యాకల్టీని రప్పించి వారితో శిక్షణ అందించనున్నారు. శిక్షణకు హాజరయ్యే నిరుద్యోగులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన తరగతులు నిర్వహించనున్నారు. వారికి ఉదయం అల్పాహారం, టీ, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. అధ్యాపకుల వేతనాలు, భోజన, అల్పాహార ఖర్చులన్నీ ఎంపీపీ జనగామ శరత్‌రావు భరించనున్నారు.
నేటి నుంచి తరగతులు ప్రారంభం
టెట్ అభ్యర్థులకు సోమవారం నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణ కోసం ముస్తాబాద్ మండల నిరుద్యోగులే కాకుండా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల రూరల్, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలం నుంచి అధికసంఖ్యలో అభ్యర్థులు హాజరుకావచ్చని శరత్‌రావు తెలిపారు. ఉచిత శిక్షణపై ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. మరోవైపు శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించనున్నారు.
ఇది రెండో సారి..
ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్‌రావు నిరుద్యోగులకు ముస్తాబాద్‌లో ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఇది రెండోసారి. రెండేండ్ల క్రితం ముస్తాబాద్‌లోనే ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయగా హాజరైన నిరుద్యోగుల్లో దాదాపు 26మంది వివిధ ఉద్యోగాలు సాధించారు. అప్పటి శిక్షణ కోసం దాదాపు రూ.10 లక్షలు వెచ్చించారు.