హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 22: నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పచ్చి అబద్ధాల కోరు అని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆయన మాటలను హుజూరాబాద్ ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు. ఈటల వల్లే తనకు ఎస్సీ కార్పొరేషన్ పదవి వచ్చిందని అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అర్వింద్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. 17 ఏళ్లు హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన ఈటల రాజేందర్ పార్టీలో ఏ ఒక్క నేతనూ ఎదగనివ్వలేదని, అందరినీ అణగదొక్కి ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కాడని నిప్పులు చెరిగారు. కొంతకాలం ఆగితే ఈటల నిజస్వరూపం బీజేపీ నేతలకూ తెలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రమే అమలు చేస్తున్నదని అర్వింద్ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. మరోసారి హుజూరాబాద్‌కు వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ను అఖండ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నేత కనుమల్ల గణపతి, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి అలేటి శ్రీరాం, విద్యార్థి సంఘం నాయకుడు విద్యాసాగర్ పాల్గొన్నారు.