కోల్సిటీ, ఏప్రిల్ 30: తాటి ముంజలనగానే నోట్లో నీళ్లూరుతయ్.. వీటిని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. ఈ మండే ఎండల్లో చల్లని ముంజలు తింటే ఆ మజానే వేరు.. వేసవి తాపానికి ఉపశమనం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఒకప్పుడు పల్లెల్లో పుష్కలంగా దొరికే తాటి ముంజలు ప్రస్తుతం పట్నాల్లో సైతం లభిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చేశాయ్.. నగరాలు, పట్టణాల్లో రహదారుల వెంబడి కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్నారు. వీటిలో లేత ముంజలు రూ.10కు ఒకటి, ముదిరినవి రూ. 10కు రెండు చొప్పున విక్రయిస్తున్నారు.
ఆరోగ్యానికి ఎంతో మేలు…
తాటి చెట్టు నుంచి వచ్చే ఈ తాటి ముంజలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు. ఈ పండు శరీరానికి కావల్సినంత శక్తినిస్తాయి. తాటి ముంజలను తినడం వల్ల శరీరానికి కావల్సిన మినరల్స్, చక్కెరను ఇవి సమతుల్యం చేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బీ, ఐరన్, క్యాల్షియం ఆరో గ్యానికి దోహదం చేస్తాయి. గర్భిణులకు కూడా ఎంతో ఉపకరిస్తుంది. గర్భధారణ సమ యంలో ముంజల్ని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా పని చేయడంతోపాటు మలబద్దకం, అసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యలను దరి చేరనీయకుండా కాపాడుతాయి.
తాటి ముంజలో ఉండే ఏ,బీ,సీ విటమిన్లు, ఐరన్, జింక్ ఫాస్పరస్, పొటాషియం, అధిక మొత్తంలో నీరు ఉండడం వల్ల అధిక బరువును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కాలేయ సంబంధ సమస్యలను కూడా తగ్గించి శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తుంది. ఈ పండును ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా దూరంగా ఉంచుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చాలా మంది ముంజలపై పొట్టులాగా ఉండే పై పొరను తీసేసి లోపలి గుజ్జులాంటి పదార్థాన్ని మాత్రమే తింటారు. అలాగాకుండా పొట్టులోనే అనేక రకాల పోషకాలు ఉంటాయని, పొట్టుతోనే తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.