రామడుగు, ఆగస్టు 22: నూలు పౌర్ణమిని పురస్కరించుకొని మండలంలోని గోపాల్రావుపేటలో పద్మశాలీ సంఘం భవనంలో స్థానిక పద్మశాలీ సంఘం సభ్యులు సామూహిక యజ్ఞోపవీత ధారణ చేశారు. ఈ సందర్భంగా పద్మశాలీ యువజన సంఘం అధ్యక్షుడు అలువాల విష్ణు మాట్లాడుతూ.. దేవతలకు వస్ర్తాలను తయారు చేయడంలో భాగంగా శివుని అనుగ్రహంతో ఉద్భవించిన పద్మశాలీ యుగపురుషుడు భావనరుషి నేటి తిథి, నక్షత్రం రోజున మహావిష్ణువు నాభినుంచి నూలును తీసి వస్త్రం తయారు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయన్నారు. ఈ దినాన పద్మశాలీలే కాకుండా రుత్వికులు, గంధర్వులు, రుషులు, అర్చకులు కూడా యజ్ఞోపవీతం ఆచరిస్తారని పేర్కొన్నారు. సంఘం అధ్యక్షుడు కొలిపాక మల్లయ్య, సిరిపురం సత్యనారాయణ, మల్లేశం, రాములు, నాగరాజు, గంగరాజు, గంగాధర్, కరంచంద్ తదితరులున్నారు.
గంగాధర, ఆగస్టు 22: మండలంలోని మధురానగర్ మార్కండేయ పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జంధ్యాల జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మశాలీ సంఘం సభ్యులు ఉదయాన్నే స్థానిక రామాలయానికి చేరుకుని మహాగణపతి పూజ, గాయత్రీ మంత్రం జపిస్తూ జంధ్యాల ధారణ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సిరిసిల్ల ప్రసాద్, సభ్యులు ఇప్పలపెల్లి శంకరయ్య, చెన్నూరి శంకర్, ఎర్రం లక్ష్మణ్, ఇప్పలపెల్లి నర్సయ్య, లక్ష్మీపతి, మధు, సమ్మయ్య తదితరులున్నారు.