పదవి ఏదైనా చివరిదాకా అనుభవించాలని, నలుగురిలో గొప్పగా ఉండాలని ప్రతి ప్రజాప్రతినిధి అనుకుంటారు! ప్రజల కోసమో.. సమస్యల పరిష్కారం కోసమే గద్దె దిగిన వారు ఈ స్వత్రంత్ర భారతావనిలో ఎక్కడో ఒకరిద్దరు కనిపిస్తారు! కానీ, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమాల బాట పట్టి.. పదవులను తృణపాయంగా వదిలి.. ఇక్కడి ప్రజల ప్రత్యేక ఆకాంక్షను ప్రపంచానికి చాటిన వారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క టీఆర్ఎస్ దళపతి కేసీఆర్, ఆయన సైన్యం మాత్రమే అని చెప్పవచ్చు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అధినేత కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనేక సార్లు తమ పోస్టులకు రాజీనామాలు చేసి చరిత్ర సృష్టించారు. సమైక్య సంకెళ్లు తెంచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి, 60ఏండ్ల ప్రజల కలను నెరవేర్చారు.
కరీంనగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీమాంధ్రలో తెలంగాణ బలవంతపు విలీనం తర్వాత వనరులు మనవైనా.. పాలకులు సీమాంధ్రులే కావడంతో దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. మనోళ్లు పల్లకీ మోసే బోయవాళ్లుగా మిగిలిపోవడం తప్ప ఒరిగిందేమీ లేదు. 1969 ఉద్యమం తర్వాత మళ్లీ సీమాంధ్రులను ఎదురించే నాథుడే లేకుండా పోయాడు. ఈ క్రమంలో దశాబ్దాలుగా జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయడం, నాలుగున్నర కోట్ల ప్రజల ‘ప్రత్యేక’ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చే లక్ష్యంతో ఆనాటి ఉద్యమ నాయకుడు నేటి సీఎం కేసీఆర్ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. అలా ఒక్క నాయకుడితో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 14 ఏండ్ల వ్యవధిలో ప్రతి మనిషి గుండె చప్పుడుగా మారి, చివరకు తెలంగాణను సాధించింది. నిజానికి టీఆర్ఎస్ ఒక పడిలేసిన తరంగం. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కెరటం. ఒక ప్రాంత సమస్య కోసం ఎన్నోసార్లు తమ పదవులను తృణపాయంగా వదులుకొని దేశచరిత్రలో రికార్డు సృష్టించడమే కాదు.. ఇక్కడి ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటిన ఘనత గులాబీ పార్టీ సొంతం.
పోరాటాలు.. రాజీనామాస్ర్తాలు..
దశాబ్ద కాలంగా జలాలు, వనరుల దోపిడీ, భూముల స్వాహా, రాజ్యాంగ ఉల్లంఘనపై పోరాటాలు చేసింది. 2006 ఆగస్టు 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేసి.. తెలంగాణ ఆకాంక్షను నలుదిశలా చాటి చెప్పింది. పులిచింతల, పోలవరం, దుమ్ముగూడెం టేల్పాండ్ వంటి అనేక ప్రాజెక్టుల కింద జలదోపిడీపై ఉద్యమాలు చేసింది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ రాజీవ్ రహదారిని 24 గంటల పాటు దిగ్బంధించింది. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసి, మహబూబ్‌నగర్‌లో వలసలు, ఉత్తర తెలంగాణ గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికుల సమస్యలపై ఉద్యమించింది. ఇటీవల ఫ్రీజోన్ విషయంలో ఒత్తిళ్లు తెచ్చి విజయం సాధించింది. సింగరేణి కార్మికుల లాభాల వాటాల పెంపునకు ఉద్యమించింది. పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు, ఆరు సూత్రాల పథకం, 610 జీవో లాంటి అనేక అంశాలపై ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. ఇలాంటి అనేక సమస్యలపై పోరాటం చేసింది. తెలంగాణ హక్కులు కాలరాస్తున్న వారిపై నేటికీ ఉద్యమిస్తూనే ఉన్నది. అది కేంద్రం కావచ్చు.. లేదా ఇతర రాష్ర్టాలు కావచ్చు.
రాజీనామాలతో రికార్డు
ఒక ప్రత్యేక ఆకాంక్ష కోసం, లెక్కలేనన్ని సార్లు రాజీనామా చేసిన పార్టీగా టీఆర్ఎస్ చరిత్రకెక్కింది.
2005 జూలై 3న ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా, టీఆర్ఎస్కు చెందిన ఆరుగురు రాష్ట్ర మంత్రులు తమ పదవులు వీడారు.
2006 ఆగస్టు 22న కేంద్ర మంత్రి పదవులకు కేసీఆర్, నరేంద్ర రాజీనామా చేశారు.
2006 సెప్టెంబర్ 12న కరీంనగర్ లోకసభ స్థానానికి కూడా కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణవాదం లేనే లేదంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలతో కలత చెందిన ఆయన, లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, కరీంనగర్ నుంచి పోటీ చేయగా, రెండు లక్షల పైచిలుకు బంపర్ మెజార్టీతో గెలిచారు.
ఉద్యమ ఉధృతిలో భాగంగా 2008 మార్చి 3న కేసీఆర్‌తో పాటు నలుగురు లోక్‌సభ సభ్యులు రాజీనామా చేశారు.
2008 మార్చి 4న 16 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామాలు సమర్పించారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించి, కరీంనగర్ నుంచి సిద్దిపేటకు బయలు దేరారు.
సీమాంధ్ర సర్కారు ఆయనను కుట్రపూరితంగా కరీంనగర్ శివారులోని అల్గునూర్ వద్ద అరెస్ట్ చేసి, ఖమ్మం తరలించింది. అయినా వెనక్కి తగ్గని కేసీఆర్ పోలీస్‌స్టేషన్‌లోనే దీక్ష కొన సాగించారు.
కేసీఆర్ అరెస్ట్‌ను జీర్ణించుకోలేని నాలుగున్నర కోట్ల ప్రజలు, కుల, మత, వర్గాలకతీతంగా రోడ్డెక్కారు. ‘మా తెలంగాణ మాగ్గావాలె..’ అంటూ ప్రపంచంలో కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యమించారు. రకరకాల పోరాట రూపాలతో కేంద్రం మెడలు వంచారు. ఇక విద్యార్థుల సంగతి వేరే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఉస్మానియా విద్యార్థుల పోరాటం వివిధ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
ఇక్కడి ప్రజల ‘ప్రత్యేక’ ఆకాంక్షను ప్రత్యక్షంగా చూసిన కేంద్ర ప్రభుత్వం, 2009 డిసెంబర్ 9న ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నాం..’ అంటూ ప్రకటించింది.
దోపిడీకి అలవాటు పడ్డ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, తెలంగాణ ఇస్తే హైదరాబాద్‌లోని తమ వ్యాపార సామ్రాజ్యాలు కుప్పకూలుతాయని భావించి, పార్టీలకతీతంగా రాజీనామాలు చేసి, ప్రత్యేక రాష్ర్టాన్ని అడ్డుకున్నారు.
ఉద్యమ ఉధృతిలో భాగంగా మరోసారి రాజీనామాల అస్త్రం ప్రయోగించక తప్పలేదు. 2010 ఫిబ్రవరి 10న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించారు.
మరోసారి జేఏసీ పిలుపు మేరకు 2011 జూలై 4న 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు రాజీనామా సమర్పించారు.