మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 24: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు. ఆదివారం మండలంలోని ముంజంపల్లి, గంగిపల్లి, కొండపల్కల, కెల్లేడు, మద్దికుంట, పోచంపల్లి, అన్నారం గ్రామాల్లో విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంఘం అధ్యక్షుడు నల్ల గోవింద రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం వడ్లు కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు న్యాయం చేస్తున్నదని చెప్పారు. అందులో భాగంగా అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. మానకొండూర్ నియోజకవర్గంలో ఇప్పటికే 37 కేంద్రాలను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు. కాగా, ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి వరి ధాన్యంతో అభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శేఖర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు రామంచ గోపాల్ రెడ్డి, మాశం శాలిని-సాగర్, నల్ల వంశీధర్ రెడ్డి, మాతంగి పుల్లయ్య, బొట్ల కిషన్, ఉప సర్పంచులు పిట్టల కుమార స్వామి, మహేందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గోపు రవీందర్ రెడ్డి, రైతు బంధు సమితి కన్వీనర్ కెక్కర్ల శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ వైస్ ప్రెసిడెంట్ పంజాల శ్రీనివాస్ గౌడ్, సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, సీఈవో లక్ష్మారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ వాల ప్రదీప్ రావు, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ పురం అనిల్, రైతులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఐక్యతతోనే అభివృద్ధి
తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 24: అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలని, అప్పుడే గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉద్ఘాటించారు. ఆదివారం రాత్రి మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ రావుల రమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో ఇదే విధంగా కలిసి మెలిసి ఉండాలని, గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి, మండల, గ్రామ నాయకులు, మసీద్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం
గన్నేరువరం, ఏప్రిల్ 24: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని చీమలకుంటపల్లిలో యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా ఆదివారం బహుమతుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు కుసుంబ నవీన, సర్పంచ్ కర్ర రేఖ, ఉప సర్పంచ్ జంగిటి ప్రకాశ్, నాయకులు కర్ర కొమురయ్య, లింగంపెల్లి నాగరాజు, క్రీడా కారులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.