జగిత్యాల, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ఉత్తర తెలంగాణ వరదాయిని ఎస్సారెస్పీకి పునర్జీవం రానున్నది. ఎగువ నుంచి నీరు రాక వట్టిపోయిన దశలో కాళేశ్వరం జలాలను వరదకాలువ ద్వారా నింపేందుకు చేపట్టిన మహత్తర యజ్ఞం ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పూర్తి కావచ్చింది. రాంపూర్, ఇబ్రహీంపట్నం పంప్‌హౌస్‌లు మూడేళ్ల క్రితమే పూర్తయి నీటిని ఎత్తిపోయగా, మిగిలిన ముప్కాల్ పంప్‌హౌస్ నిర్మాణం తుది దశకు చేరింది. త్వరలో పూర్తయి కాళేశ్వరం జలాలు ప్రాజెక్టులోకి చేరనున్నాయి. దీని వల్ల ఉమ్మడి కరీంనగర్‌తోపాటు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతాంగానికి మేలు జరగనుండగా, ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
దాదాపు 60 ఏండ్ల క్రితం అంకురార్పణ అయిన ఎస్సారెస్పీ ఫలాలు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలను మార్చాయి. ఒకప్పుడు సాగు నీటి కోసం తపించిన రైతులు, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం, కాకతీయ కెనాల్ ద్వారా నీరు రావడంతో సేద్యంలో మునిగిపోయారు. మూడు జిల్లాల ఆర్థిక వ్యవస్థను, బతుకుదెరువును, ఎస్సారెస్పీ ప్రాజెక్టు మార్చిందనే చెప్పాలి. అయితే, 112 టీఎంసీల సామర్థ్యంతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే విధంగా నిర్మించిన ఎస్సారెస్పీ సమైక్య పాలకుల పట్టింపులేని తనంతో కాలక్రమంలో తన సామర్థ్యాన్ని కోల్పోయింది. 1994లో 90.30 టీఎంసీలకు, 2013లో 80.13 టీఎంసీలకు కుచించుకుపోయింది.
మొత్తంగా 31 టీఎంసీల నిల్వను కోల్పోగా, 28 శాతం సామర్థ్యం తగ్గిపోయిందని నిపుణులు ప్రకటించారు. ఇక ఎగువన ఉన్న మహారాష్ట్ర గోదావరిపై కట్టిన అనేక చెక్‌డ్యామ్‌లు, ప్రాజెక్టుల వల్ల నదిలో నీటి లభ్యత తగ్గిపోయింది. రెండు దశాబ్దాలుగా గోదావరిలో మహారాష్ట్ర దిగువన మనకు 54 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని జల నిపుణులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీని నమ్ముకున్న ఆయకట్టు రైతులకు క్రమంగా ఇబ్బందులు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద ఎక్కువగా వచ్చినప్పుడు నీటిని నిల్వ చేసుకునేందుకు, మిడ్‌మానేరు, దిగువ మానేరుకు వేగంగా తరలించేందుకు 22 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో వరద కాలువను 122 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. అయితే, వరదలు లేకపోవడంతో వరద కాలువలో నీరు పారలేదు. దీని వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
పునర్జీవంతో జీవనదిలా వరదకాలువ
ఎస్సారెస్పీలో నీటి లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మేడిగడ్డ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువను వినియోగించుకొని ఎస్సారెస్పీలోకి నీటిని తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ పునర్జీవ పథకాన్ని రూపొందించారు. 1067 కోట్ల వ్యయంతో 2017 ఆగస్టు 10న ఆయనే స్వయంగా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా మూడు పంప్‌హౌస్‌లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి పంప్‌హౌస్‌ను ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 73వ కిలోమీటర్ వద్ద మల్యాల మండలం రాంపూర్ గ్రామ సమీపాన.. రెండోది 34వ కిలోమీటర్ వద్ద ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్రావుపేట సమీపాన.. మూడోది ఎస్సారెస్పీకి పది మీటర్ల దూరంలో ముప్కాల్ వద్ద నిర్మించారు. వరద కాలువ 102 కిలోమీటర్ వద్ద క్రాస్ రెగ్యులేటరీని ఏర్పాటు చేసి, అక్కడి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్‌మానేరు), మల్యాల మండలం రాంపూర్ పంప్‌హౌస్‌కు నీటిని రివర్స్‌పంప్ చేశారు. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్‌కు చేర్చారు. అక్కడి నుంచి ఎస్సారెస్పీ సమీపంలోని ముప్కాల్ పంప్‌హౌస్‌కు చేర్చుతూ వచ్చారు. అయితే, ముప్కాల్ వద్ద పంప్‌హౌస్ పూర్తికాకపోవడంతో ఇప్పటి వరకు నీటిని ప్రాజెక్టులోకి ఎత్తిపోసే కార్యక్రమం మొదలు పెట్టలేదు.
పునర్జీవంతో సస్యశ్యామలం
ఎస్సారెస్పీ ప్రాజెక్టు కిందనే ఉన్నప్పటికీ జగిత్యాల జిల్లాలోని మల్యాల, కొడిమ్యాల, వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, మేడిపల్లి మండలాలు నాన్ ఆయకట్టు ప్రాంతాలుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రాంతాలను కవర్ చేస్తూ వరద కాలువ నిర్మాణం జరిగినా.. వారికి ప్రయోజనం కలుగలేదు. అయితే, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో వరద కాలువ పరిస్థితి మారిపోయింది. తుమ్మలు మొలిచి, నీళ్లులేక భయంకరంగా మారిన వరద కాలువ ఇప్పుడు జీవనదిలా మారింది.
పంప్‌హౌస్‌ల నిర్మాణంతోపాటు కాలువకు 13 స్లూయిజ్‌లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడంతో జిల్లాలోని నాలుగు మండలాల పరిస్థితులు మారిపోయాయి. ఎండకాలంలో సైతం మత్తడి దూకే చెరువులు కనిపించడం మొదలైంది. భూగర్భజలాలు పెరగడంతో నాలుగు మండలాల్లో సేద్యం పెరిగిపోయింది. చెరువుల ఆయకట్టు సేద్యం మొదలైంది. పునర్జీవ పథకం అందుబాటులోకి వచ్చిన మూడేండ్లలో జగిత్యాల జిల్లాలో అదనంగా లక్షన్నర ఎకరాల భూమి స్థిరీకరించబడింది.
తుదిదశకు మూడో పంప్‌హౌస్..
ఎస్సారెస్పీ పునర్జీవ పథకం వందశాతం పూర్తయింది. వరద కాలువపై రాంపూర్, రాజేశ్వర్రావుపేట వద్ద పంప్‌హౌస్‌లను పూర్తి చేసి, మూడేళ్ల క్రితమే నీటిని ఎత్తిపోశారు. ముప్కాల్ పంప్‌హౌస్‌తో సంబంధం లేకుండా ఎస్సారెస్పీ ప్రాజెక్టు సమీపం వరకు తరలించారు. ముప్కాల్ పంప్‌హౌస్ పనులు తుది దశకు చేరాయి. త్వరలోనే నీటిని ఎత్తిపోసే ప్రక్రియకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇక్కడ 6 పంపులను ఏర్పాటు చేయగా, ఒక్కో పంప్ ద్వారా 1,450 క్యూసెక్కుల చొప్పున రోజుకు ఒక టీఎంసీ ఎత్తిపోయనున్నారు. 60 టీఎంసీలను ప్రాజెక్టులోకి ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎత్తిపోసిన నీటిని మళ్లీ ప్రాజెక్టు ప్రధాన కాలువలైన కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ ద్వారా సరఫరా చేయనుండడంతో ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల రైతాంగం పూర్తి భరోసాతో ఉంది.