వీణవంక, ఏప్రిల్ 22: ఏండ్ల తరబడి ఏ ప్రభుత్వాలు, ఏ నాయకుడు ప్రవేశ పెట్టని దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన దళితుల అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కండె దేవబాల, కొలుగూరి రజిత, లక్ష్మి, బోయిని స్వరూపకు దళితబంధు కింద డీసీఎం, రెండు మినీ గూడ్స్ వాహనాలు మంజూరు కాగా, శుక్రవారం బండ శ్రీనివాస్ వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ దళితుల ఆర్థికాభివృద్ధి కోసం హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు కింద ప్రతిరోజూ వందల సంఖ్యలో యూనిట్లను గ్రౌండింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికీ యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించి, రానున్న రోజుల్లో అండగా ఉండాలని కోరారు. దళితుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్ గొప్ప నాయకుడని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. దళితబంధు లబ్ధిదారులంతా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి, నర్సింగాపూర్ సర్పంచ్ గంగాడి సౌజన్య-తిరుపతిరెడ్డి, వార్డు సభ్యులు కండె మహేందర్, రాజిరెడ్డి, రజిత-కుమార్, గురువయ్య, నాయకులు తాండ్ర శంకర్, జీడి తిరుపతి, పర్లపెల్లి తిరుపతి, రజినీకాంత్, సమ్మయ్య, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట మండలం మడిపల్లిలో..
జమ్మికుంట రూరల్, ఏప్రిల్ 22: మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల సుమలత-శ్రీనివాస్, గంగారపు అన్నపూర్ణ-తిరుపతి దళితబంధు కింద గ్రామంలో టెంట్‌హౌస్‌లు ఏర్పాటు చేసుకోగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా చితికిపోయిన దళితులకు దళితబంధు పథకం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు.
ఇతరులకు ఉపాధి కల్పంచాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మూగల పరశురాములు, ఏఎంసీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్‌కుమార్, దళితరత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్, కార్మిక సంఘం మండలాధ్యక్షుడు వొల్లాల శ్రీనివాస్‌గౌడ్, వార్డు సభ్యులు ప్రదీప్, వెంకటేశ్, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.