Prakash Raj | భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ వరల్డ్ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు సినిమా విషయాలపై గోప్యత పాటించిన రాజమౌళి, ఇటీవల ఒక్కో అప్డేట్ను బయటపెడుతూ అభిమానుల్లో హైప్‌ను మరింత పెంచుతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ముగ్గురు ప్రధాన పాత్రల ఫస్ట్ లుక్స్‌ను ఇప్పటికే చిత్రబృందం విడుదల చేయగా, టైటిల్ టీజర్ ద్వారా ‘వారణాసి వరల్డ్’ ఎలా ఉండబోతుందో ఒక విజువల్ శాంపిల్‌ను చూపించారు. ఓ హాలీవుడ్ ఇంటర్వ్యూలో రాజమౌళి సినిమా జానర్, కథ నేపథ్యంపై స్వల్ప హింట్స్ కూడా ఇచ్చారు.
ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో రామాయణానికి సంబంధించిన ఓ ఎపిసోడ్ కూడా ఉండబోతుందని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. కొన్ని నిమిషాల పాటు మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఆ ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తైందని, ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ అంశం సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో నటిస్తున్న విషయం కొంతకాలం క్రితమే వెల్లడించగా, ఇప్పుడు తన పాత్రను కూడా స్వయంగా బయటపెట్టారు. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో పాల్గొన్న ఆయన, ‘వారణాసి’ చిత్రంలో తాను మహా శివభక్తుడి పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. ఈ పాత్ర తన నటనా జీవితంలో మరో ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రకాశ్ రాజ్ గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో నటించారు. అలాగే మహేష్ బాబుతో ‘రాజకుమారుడు’ నుంచి ‘గుంటూరు కారం’ వరకు అనేక హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంది. గతంలో ‘ఢమరుకం’ చిత్రంలో శివుడి పాత్రలో కనిపించిన ప్రకాశ్ రాజ్, ఇప్పుడు శివభక్తుడిగా నటించడం విశేషం. ప్రస్తుతం ‘వారణాసి’ తదుపరి షెడ్యూల్‌కు చిత్రబృందం సిద్ధమవుతోంది. విజువల్ గ్రాండియర్, మైథాలజీ ఎలిమెంట్స్, యాక్షన్ అడ్వెంచర్ మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ సీజన్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అభిమానులు మాత్రం ఈ సినిమాను భారతీయ సినిమా గర్వంగా నిలిచే ప్రాజెక్ట్‌గా భావిస్తూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.