కొడిమ్యాల, ఏప్రిల్ 20: పదకొండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకును చూసి కన్నపేగు తల్లడిల్లుతున్నది. దవాఖానల చుట్టూ తిరిగినా నయం కాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నది. అప్పులు తెచ్చి రూ. 20లక్షల దాకా ఖర్చుచేసినా ఫలితంలేకపోవడంతో కలతచెందుతున్నది. ఇటీవలే చిన్నపేగుకు ఇన్ఫెక్షన్ సొకగా ఆపరేషన్‌కు రూ. 5లక్షలు అవసరమని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. దాతలు ముందుకువచ్చి ఆపన్నహస్తం అందించి కొడుక్కు ప్రాణభిక్ష పెట్టాలని దీనంగా వేడుకుంటున్నది. కొడిమ్యాల మండలం నల్లగొండకు చెందిన కన్న కృష్ణ -అంజవ్వ దంపతులు దినసరి కూలీలు, వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు. పెద్ద కొడుకు కన్నం వినయ్‌కుమార్ 11సంవత్సరాల క్రితం వెన్నునొప్పి రాగా తల్లిదండ్రులు ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించారు.
వెన్నునొప్పి నయంకాకముందే కీళ్లనొప్పుల బారినపడ్డాడు. జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్‌లోని పలు దవాఖానల్లో చికిత్స చేయించారు. ఆస్తులు అమ్మి, అప్పులు తెచ్చి రూ. 20 లక్షల దాకా ఖర్చు చేశారు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. నిత్యం మందులు వాడాల్సిన పరిస్థితి. ఇటీవలే తీవ్ర జ్వరం రావడంతో పాటు తరుచూ వాంతులు అవుతుండగా చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానకు తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు చిన్నపేగుకు ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఆపరేషన్‌కు రూ. 5లక్షల దాకా ఖర్చవుతుందని చెప్పారు.
అయితే ఇప్పటికే అప్పులు తెచ్చి చికిత్స చేయించిన తల్లిదండ్రులు..ఇక భరించే స్థోమతలేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు దయతలిచి సాయం చేసి కొడుకును బతికించాలని వేడుకుంటున్నారు. సాయం చేయాల్సిన వారు గజ్జల నవీన్ ఖాతా నంబర్ 080 411100000937 ఐఎఫ్ఎస్సీ కోడ్ ,యూబీఐన్ 0808041 యూనియన్ బ్యాంక్ ( ఓల్డ్ ఆంధ్రా బ్యాంక్ ) కొడిమ్యాల బ్రాంచ్ గుగూల్ ఫే ,ఫోన్ పే నంబర్ 9182701115లో నగదు జమ చేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు.