హుజూరాబాద్‌టౌన్, ఏప్రిల్ 20: ప్రజలు అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, అగ్నిమాపక శాఖ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నదని జిల్లా ఫైర్ ఆఫీసర్ తగరం వెంకన్న పేరొన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల సందర్భంగా హుజూరాబాద్ ఫైర్ స్టేషన్లో ముగింపు కార్యక్రమానికి జిల్లా ఫైర్ అధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం వస్తేనే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా పూర్తిస్థాయిలో కాపాడవచ్చన్నారు. 50 వేల జనాభా, ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒకో నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ చొప్పున ఏర్పాటు చేశారన్నారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంటలో ఫైర్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.
ఫైర్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. త్వరలోనే పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. దీంతో పూర్తిస్థాయిలో ఉద్యోగులు చేరి ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా తమ శాఖ ముందుకు సాగుతున్నదన్నారు. ఒకో స్టేషన్లో 16 నుంచి 20 మంది సిబ్బంది అవసరముండగా ప్రస్తుతం 10 నుంచి 14 మంది వరకు కొనసాగుతున్నారని వెల్లడించారు. దీనిలో ఆర్టీసీ నుంచి 13 మంది డ్రైవర్లు, పోలీసు శాఖ నుంచి 25 మందిని డిప్యుటేషన్‌పై తీసుకున్నామన్నారు. ప్రజల్లో అగ్నిప్రమాదాల పట్ల సమగ్ర అవగాహన రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి శుక్రవారం ఫైర్ స్టేషన్ పరిధిలో ఎకడో ఒకచోట అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయవంతమయ్యాయని తెలిపారు. ఎండాకాలంలో ఎకువగా రైతులు వరి కొయ్యలను తగలబెట్టడంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామని, దీనిపై రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏ చిన్న అగ్ని ప్రమాదం జరిగినా గమనించిన వారు వెంటనే అగ్నిమాపకశాఖ సెల్‌ఫోన్‌కు గానీ, 101 ల్యాండ్ ఫోన్‌కు కానీ ఫోన్ చేసి సమగ్ర సమాచారం సకాలంలో ఇస్తే అగ్నిమాపక శాఖ ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా చూస్తుందన్నారు. ప్రజల్లో స్పందించే గుణం రావాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి ఫైర్ ఇంజన్‌కు జీపీఎస్ ఏర్పాటుచేసి ఫైర్ ఇంజిన్ల పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. హుజూరాబాద్ ఫైర్‌స్టేషన్ ఆవరణలో హెచ్‌పీసీఎల్ పెట్రోల్ పంపు ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందన్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ ఉపయోగించే వివిధ రకాల వస్తువులు, పరికరాలు ఏ విధంగా పనిచేస్తాయో, కాలానుగుణంగా కొత్త కొత్త పద్ధతులను అనుసరించి అగ్ని ప్రమాదాలను ఎలా నివారిస్తారో సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ డీ ప్రభాకర్, హుజూరాబాద్ ఫైర్ ఆఫీసర్ చల్లూరి రాజయ్య, మానకొండూర్ ఫైర్ ఆఫీసర్ భూదయ్య, ఫైర్ సిబ్బంది పీ వెంకటేశ్వర్లు, యూ ఆంజనేయులు, ఐవీ రెడ్డి, ఈ ప్రభాకర్, డీ సురేశ్, వీ శ్రీనివాస్, పీ శ్రీధర్, జీ అనిల్‌కుమార్, పీ రాజయ్య, పీ రాజు తదితరులు పాల్గొన్నారు.