కరీంనగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): వస్తువులు, ఆభరణాల నాణ్యతా ప్రమాణాలను గుర్తించేందుకు భారతీయ ప్రమాణాల సంస్థ(బీఐఎస్)కేర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లీగల్ మెట్రాలజీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో భారతీయ ప్రమాణాల సంస్థ కేర్ యాప్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాలు, పాఠశాలలు, వసతి గృహాల్లో ప్రతి రోజూ వాడే వస్తువుల నాణ్యతను గుర్తించేందుకు బీఐఎస్ కేర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ యాప్‌ను ఉపయోగించడం ద్వారా ఆభరణాల నాణ్యతను తెలుసుకోవచ్చని చెప్పారు. భారతీయ ప్రమాణాల సంస్థ హైదరాబాద్ డైరెక్టర్ కేవీ రావు మాట్లాడుతూ ఐఎస్ఐ మార్ ఉన్న వస్తువులను మాత్రమే వినియోగించుకునేలా జిల్లా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బంగారు ఆభరణాలపై ఉన్న హెచ్‌యూఐడీ నంబర్ ఆధారంగా వాటి నాణ్యతను తెలుసుకోవచ్చన్నారు.
జ్యువెల్లరీ షాప్స్‌కు కూడా హాల్ మార్ ఉండాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. భారతీయ ప్రమాణాల సంస్థ జాయింట్ డైరెక్టర్ శివప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బీఐఎస్ కేర్ యాప్ గురించి అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్ లాల్, లీగల్ మెట్రాలజీ జిల్లా అధికారి, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజమనోహర్ రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేశ్, సివిల్ సైప్లె డీఎం శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గంగారం, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మధుసూదన్ రావు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నతానియెల్, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.