కరీంనగర్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): యాసంగి వడ్లపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధమే చేసింది. ఎప్పటిలాగే బాయిల్డ్ బియ్యం కొనాలని డిమాండ్ చేస్తూ రైతన్న పక్షాన ఆందోళనలతో హోరెత్తించింది. ఈ నెల 11న ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక రోజు ధర్నా కూడా నిర్వహించింది. అయినా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోగా తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా వ్యాఖ్యానించింది. దీంతో వడ్ల కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. చివరి గింజా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని రైతులకు భరోసా కల్పించారు. యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం నిరాకరించినా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతులు నష్టపోవద్దని, కనీస మద్దతు ధర 1,960కి ప్రతి గింజా కొనుగోలు చేస్తామని ప్రకటించారు. దీంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని పేర్కొంటూ ముఖ్యమంత్రి చిత్రపటాలకు ఊరూరా పాలాభిషేకాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నమ్మకంతో కోతలకు సిద్ధమవుతున్నారు.
ఈ సారి తగ్గిన వరి సాగు
కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనుగోలు చేయమని చెప్పడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సీజన్‌కు ముందే రైతాంగాన్ని ఇతర పంటల వైపు మళ్లించారు. దీంతో జిల్లాలో కొంత వరకు వరి సాగు తగ్గింది. 2020-21లో 2,64,542 ఎకరాల్లో వరి సాగు కాగా, ఈ సారి 2,46,642 ఎకరాలకు తగ్గింది. దీంతో దిగుబడులు కూడా తగ్గే అవకాశమున్నది. అంతే కాకుం డా సాగైన వరిలో సుమారు 1.10 లక్షల ఎకరా ల్లో రైతులు వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని సీడ్ ఉత్పత్తికి మొగ్గు చూపారు. కొందరు రైతులు మిల్లర్లలో నేరుగా ఒప్పందాలు చేసుకుని వరి సాగు చేశారు. ఈ నేపథ్యంలో ఈ సారి 3.39 లక్షల వరకు మార్కెటింగ్‌కు వచ్చే అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
శరవేగంగా ఏర్పాట్లు
సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాలో ముమ్మరంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులకు తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీ చేశారు. ముందుగా కోతలు వచ్చే ఏరియాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కనీస మద్దతు ధరకు వడ్లు కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాలో 313 గ్రామాలు ఉంటే ప్రస్తుతం ఐకేపీ ఆధ్వర్యంలో 63, ప్యాక్స్ 231, డీసీఎంఎస్ 46, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 8 అంటే మొత్తం 348 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని పెద్ద గ్రామాల్లో రెండు అంతకంటే ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
కొనుగోళ్లు వేగంగా, త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కనీస మద్దతు ధర రూ. 1,960కి కొనుగోలు చేయాలంటే ఎఫ్‌సీఐ సూచించిన ఎఫ్ఏక్యూ నామ్స్‌ను తప్పని సరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 21 నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ముఖ్యంగా గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సివిల్ సప్లయ్స్ జిల్లా మేనేజర్ ఎం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. జిల్లాకు సుమారు 84 లక్షల గన్నీ సంచులు అవసరం ఉంటాయని, ప్రస్తుతం 40 లక్షలకు ఇండెంట్ ఇచ్చామని, అందులో 5 లక్షల వరకు ఇప్పటికే వచ్చాయని చెబుతున్నారు. జిల్లాలో ఉన్న 190 మిల్లులను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అయితే ప్రస్తుతం అన్ని కొన్ని మిల్లులకు ధాన్యం మరాడించేందుకు ఇస్తున్నామని చెప్పారు.
ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు రానివ్వం
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. కానీ, సీఎం కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ కూడా ఇబ్బందులు రానివ్వం. ఈ సీజన్లో 15 కోట్ల మేరకు గన్నీ బ్యాగులు డిమాండ్ ఉండొచ్చని అంచనా వేశాం. బ్యాగుల సేకరణకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే 3.10 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేసుకున్నాం. కొరత లేకుండా చూస్తాం. రాష్ట్రంలో 250 ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించాం. త్వరలోనే అన్నిచోట్లా ప్రారంభిస్తాం. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం.
– మంత్రి గంగుల కమలాకర్