తంగళ్లపల్లిలో అంబేద్కర్ భవన్కు శంకుస్థాపన.. జిల్లాకేంద్రంలో ప్రారంభోత్సవం
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్/సిరిసిల్ల రూరల్/ కోనరావుపేట, ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంత్యుత్సవాల వేళ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో అలుపెరుగకుండా పర్యటించారు. గురువారం మధ్యాహ్నం 12గంటల నుంచి మండే ఎండను సైతం లెక్క చేయకుండా.. సాయంత్రం 6గంటల దాకా తిరిగారు. దారి పొడవునా అందరితో మమేకమవుతూ.. ఆపదలో ఉన్నవారికి భరోసానిస్తూ ముందుకుసాగారు.
సారంపల్లి, మల్లాపూర్, అంకుసాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో నూతన అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించి, ఆ మహనీయుడిని స్మరించుకున్నారు. తంగళ్లపల్లిలో అంబేద్కర్ భవన్కు శంకుస్థాపన చేసిన ఆయన, జిల్లాకేంద్రంలో అంబేద్కర్ భవన్కు ప్రారంభోత్సవం చేశారు. అక్కడే దళితబంధుకు శ్రీకారం చుట్టి, లబ్ధిదారులకు సుమారు 12కోట్ల విలువైన చెక్కులు అందజేశారు. తర్వాత వారితో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం కోనరావుపేట మండలం ధర్మారంలో ఎంఈవో మంకు రాజయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
అంబేద్కర్ జయంత్యుత్సవాల వేళ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మండుతున్న ఎండను లెక్క చేయకుండా హుషారుగా తిరిగారు. అంబేద్కర్ సేవలను స్మరిస్తూ.. ఆపదలో ఉన్నవారికి భరోసానిస్తూ ముందుకుసాగారు. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరితో మమేకయ్యారు. కారు దిగి విద్యార్థినులను పలకరిస్తూ.. వృద్ధులు, మహిళలతో ఆప్యాయంగా ముచ్చటించారు. గురువారం మధ్యాహ్నం 12:05 గంటలకు తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చేరుకున్నారు. సారంపల్లితోపాటు మల్లాపూర్, అంకుసాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో నూతన అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించి, నివాళులర్పించారు.
ఆయాచోట్ల మహిళలు, దళిత సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంకుసాపూర్లో బొడ్రాయి, సార్గమ్మకు అమాత్యుడు ప్రత్యేక పూజలు చేశారు. పాడి పంటలు బాగా పండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం 1:50 గంటలకు తంగళ్లపల్లిలో అంబేద్కర్ భవనానికి శంకుస్థాపన చేశారు. 2:02 గంటలకు జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. అంబేద్కర్ చౌక్ వద్ద నిర్వహించిన జయంత్యుత్సవాల్లో పాల్గొని, విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిసిల్లలో అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించారు.
అదే భవనంలో దళితబంధు లబ్ధిదారులకు జంబో చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వారితో సహపంక్తి భోజనం చేశారు. ఆ తర్వాత సిరిసిల్లలో ఆధునీకరించిన ఎస్సీ బాల, బాలికల వసతిగృహాలను ప్రారంభించారు. సాయంత్రం 6 గంటలకు కోనరావుపేట మండలం ధర్మారం చేరుకున్నారు. ఎంఈవో మంకు రాజయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఏకం చేసి ముందుకు నడిపించారని, తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ర్టానికి మోడల్ ఎంఈవోగా పనిచేశారని అక్కడ ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో రాజయ్య సార్ సేవలను కొనియాడారు. సాయంత్రం ఏడు గంటలకు హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు.