కరీంనగర్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలుగా చీకట్లు కమ్ముకున్న దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయి. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘దళితబంధు’తో పేదరికం చీకట్లు తొలుగుతున్నాయి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం యూనిట్ల పంపిణీ జాతరను తలపించింది. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ 1,041 మందికి రూ. 94.83కోట్ల విలువైన 769 యూనిట్లను పంపిణీ చేశారు. ఆయాచోట్ల పండుగ వాతావరణంలో గూడ్స్ వాహనాలు, ట్రాక్టర్లు, జేసీబీలు, డీసీఎం వ్యాన్లు, టిప్పర్ లారీలు, వరి నాటు యంత్రాలను తీసుకొని లబ్ధిదారులు ఆనందంలో మునిగిపోయారు. కూలీనాలి చేసుకొని బతికే తమ బతుకులను తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జేజేలు పలుకడమేకాదు, నిండునూరేళ్లు సల్లంగ ఉండాలని దీవించారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన దళితబంధు పథకం విజయవంతంగా అమలవుతున్నది. లబ్ధిదారుల ఆర్థిక ప్రగతికి దోహదపడేలా యూనిట్ల గ్రౌండింగ్ జరుగుతున్నది. ఇప్పటికే వేలాది మందికి మంజూరు చేయగా, గురువారం అంబేద్కర్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియం వేదికగా ఒకే సారి 1,041 మందికి 94,83,69,830 విలువైన 769 యూనిట్లను పంపిణీ చేశారు. జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, మేయర్ సునీల్‌రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ లబ్ధిదారులకు అందించారు. అందులో 320 మందికి 321 గూడ్స్ వాహనాలు, 281 మందికి 281 ట్రాక్టర్లు, 440 మందికి 168 గ్రూప్ యూనిట్లు (జేసీబీలు, డీసీఎం వ్యాన్లు, టిప్పర్ లారీలు, వరి నాటు యంత్రాలు) ఉండగా, దళితబిడ్డలు ఆనందంలో మునిగిపోయారు. తమకు మంజూరైన యూనిట్లను పొందడానికి కుటుంబాలతో సహా తరలి వచ్చి.. పండుగ వాతావరణంలో అందుకొని సంబురపడ్డారు. వీటితో తమకు శాశ్వత ఉపాధి దొరుకుతుందని, ఆర్థికంగా తాము ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
అన్నా దమ్ములు కలిసి..
వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన ఊట్ల పుష్ప, ఊట్ల సుదర్శన్, ఊట్ల దేవదాసు అన్నదమ్ములు. నిరుపేదలు. కానీ, ఇప్పుడు వీరు జేసీబీకి యజమానులు. గురువారం వాహనాన్ని అందుకుని సంబురపడ్డారు. తాము జేసీబీ నడిపించుకుని ఆర్థికంగా ఎదుగుతామనే ధీమా వ్యక్తం చేశారు. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ట్రాక్టర్ డ్రైవర్ ఓనరైండు..
హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి బండ శిరీష, విజయ్‌కుమార్ దంపతులకు దళిత బంధు కింద ట్రాక్టర్ వచ్చింది. వీరి సంతోషానికి అవధులు లేవు. ఇన్నాళ్లూ ఇతరుల ట్రాక్టర్లపై పనిచేసి, నెలకు 10 వేల జీతం తీసుకున్న విజయ్‌కు ట్రాక్టర్ కొనుక్కోవాలనేది చిరకాల కోరిక. దళిత బంధు ఆ కలను నెరవేర్చింది. ఇప్పుడా కుటుంబం ఒక ట్రాక్టర్‌కు ఓనరయ్యింది. తమ గ్రామంలో పొలాలు దున్నే పని ఎక్కువగా ఉంటుందని, తనకు పూర్తి అనుభవం ఉన్నదని ఈ సందర్భంగా విజయ్‌కుమార్ చెప్పారు. తమ కుటుంబానికి ఈ ట్రాక్టర్ అండగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణలోనే అంబేద్కర్ కలలు సాకారం
దేశంలో అంటరానితనం పోవాలని, దళితుల జీవితాల్లో వెలుగులు నిండాలని, వారు ఆర్థికంగా బలపడితేనే సామాజికంగా ముందుకు పోతారని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎన్నో కలలుగన్నారు. వాటిని సీఎం కేసీఆర్ తెలంగాణలో నిజం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే దళిత బంధు పథకం. రాష్ట్రంలో సంపద పెరగాలని, ఆ సంపద పేదలకు పంచాలనే ఉద్దేశంతోనే దీనిని ప్రవేశ పెట్టారు. ఒక్క మన రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు. దేశంలో ఇప్పటి వరకు దళితులను వెనక్కి నెట్టిన వాళ్లేగానీ, చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేసిన వారు ఎవరూ లేరు. ఇలాంటి దళితులను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి పథకం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి మంచి మనసున్న మహారాజుగా చరిత్రలో నిలిపోతారు.
– మంత్రి గంగుల కమలాకర్