మానకొండూర్, ఏప్రిల్ 14: భారతరత్న, మహనీయుడు అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉద్ఘాటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం మానకొండూర్‌లో ‘అంబేద్కర్ జాతర’ నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. టీఅర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమానికి వక్తలుగా హాజరైన దళిత ఫ్రోఫెసర్ కోటేశ్వర్రావు, ప్రముఖ రచయిత సుభద్ర అంబేద్కర్ జీవిత విశేషాలను వివరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అర్బీఎస్ జిల్లా కోఅర్డినేటర్ తిరుపతి, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు. కాగా, నియోజకవర్గంలోని అరు మండలాల నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన 100 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన దళితబంధు యూనిట్ల ప్రొసీడింగ్స్ ను లబ్ధిదారులకు ఎమ్మెల్యే రసమయి అందజేశారు.
ధూంధాంలో కళాకారుల ప్రదర్శనలు
కార్యక్రమ ప్రారంభానికి ముందు చెరువుకట్ట వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రసమయి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. ఆనంతరం మహిళల కోలాటాలు, వివిధ కళారూపాలు, బతుకమ్మ, బోనాలతో ర్యాలీగా బాలుర ఉన్నత పాఠశాల మైదానానికి తరలివచ్చారు. సాంస్కృతిక సారథి కళాకారులతో ఏర్పాటు చేసిన ధూంధాం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు నృత్యాలతో హోరెత్తించారు.