తెలంగాణ చౌక్, ఏప్రిల్ 14: అంబేద్కర్ దేశ ప్రజల ఆస్తి అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంత్యుత్సవాన్ని జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి హాజరై ముం దుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎంతోమంది బడుగు, బలహీన వర్గాల నాయకులు రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ మిగతా వర్గాలకు తీసిపోని విధంగా వివిధ రంగాల్లో ఎదుగుతున్నారని చెప్పారు. ఇది అంబేద్కర్ గొప్పతనమేనని పేర్కొన్నారు. రిజర్వేషన్లను ఎత్తివేసే క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తున్నదని ఆరోపించారు.
ఇందులో భాగంగానే ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఎల్ఐసీ, రైల్వే, సింగరేణి, బీఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్న సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధికి నిరంతరం తపిస్తున్నారని చెప్పారు. దళితబంధు పథకాన్ని తెలంగాణలో విజయవంతంగా అమలు చేయడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. భవిష్యత్‌లో అంబేద్కర్ జయంత్యుత్సవాన్ని జాతీయ పండుగలా జరుపుకొనేందుకు అన్ని వర్గాలవారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దళిత సంఘాల కోరిక మేరకు నగర శివారులో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్‌లో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బా లకిషన్ మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు దేవు డు అంబేద్కర్ అని పేర్కొన్నారు. దేశ ప్రజల హ క్కులు, సంక్షేమాన్ని నిరంతరం కాపాడుతున్న మహనీయుడు అని కొనియాడారు.
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. మేయర్ వై.సునీల్‌రావు మాట్లాడుతూ.. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో దళితవాడల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కోర్టు చౌరస్తాను అంబేద్కర్ కూడలిగా నామకరణం చేసేందుకు సర్వసభ్య సమావేశంలో తీర్మానించనున్నట్లు ప్రకటించారు. సీపీ వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రపం చ దేశాలకు మార్గదర్శకంగా మారిందని పేర్కొన్నారు.
సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ.. ఏ దే శంలో బలమైన రాజ్యాంగం ఉంటుందో ఆ దేశం సుస్థిరంగా ఉంటుందని, ఇందుకు నిదర్శనమే భారతదేశమని పేర్కొన్నారు. సభాధ్యక్షుడిగా సముద్రాల అజయ్ వ్యవహరించగా, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మ న్ బండ శ్రీనివాస్, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్‌లాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ప్రజా సంఘాల అధ్యక్షుడు గజ్జెల కాంతం, నాయకులు మేడి మహేశ్ ఆనందరావు, దేవయ్య, శంకర్, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.