శంకరపట్నం, ఏప్రిల్ 14: తల్లిదండ్రుల మరణంతో దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్న అభాగ్యులకు బాసటగా నిలిచామని మానకొండూర్ ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్ ఉద్ఘాటించారు. మండలంలోని కరీంపేట్‌కు చెందిన బొజ్జ సమ్మ య్య ఐదేండ్ల క్రితం మరణించగా అతడి భార్య అరుణ ఏడాది కిందట కన్నుమూసింది. దీంతో సమ్మయ్య తల్లి, ఇద్దరు కూతుర్లు, సాయి దిక్కులేనివారయ్యారు. వీరిని పరామర్శించేందుకు వెళ్లిన రసమయి దీనగాథను చూసి చలించిపోయారు. ఉద్యమంలో సమ్మయ్య కీలకపాత్ర పోషించాడు. డప్పు కళాకారిణిగా అరుణ వెంట నడిచింది. ఈ నేపథ్యంలో పిల్లలను చదివించేందుకు ముందుకువచ్చారు. అలాగే ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇటీవల ఇంటి నిర్మాణం పూర్తికాగా అంబేద్కర్ జయంతి రోజున గృహప్రవేశం చే యించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని జరిపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు లేనిలోటు తీర్చకున్నా తోబుట్టువులా అండగా ఉంటున్నానని చెప్పారు. వారి పెద్ద కూతురు మౌనిక వివాహం జరగగా కల్యాణలక్ష్మి చెక్కును అందజేశామని పేర్కొన్నారు. తాడికల్ విండో చైర్మన్ మధూకర్‌రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నేతల సహకారంతో ఓ గూడు నిర్మించి అంబేద్కర్ నిలయంగా పేరు పెట్టి కానుకగా ఇచ్చామన్నారు. మానస, సాయి చదువు బాధ్యతను చూసుకుంటానని చెప్పారు. కాగా, అంతకుముందు ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీఆర్, ఎంపీపీ సరోజన, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ మల్లయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖాజా పాషా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్ ఉన్నారు.