సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 12: రాజన్నసిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన 48 వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రంగారెడ్డి బాల, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. మంగళవారం ఉత్కంఠ పోరులో నల్గొండ జట్లపై గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 68 జట్లు పోటీల్లో తలపడ్డాయి. బాలబాలికల విభాగాల్లో నల్గొండ, రంగారెడ్డి జట్లు తుది పోరుకు అర్హత సాధించాయి. ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహించిన బాలికల విభాగం పోటీల్లో నల్గొండ-రంగారెడ్డి జట్లు తలపడ్డాయి. నల్గొండ 37 పాయింట్లు. రంగారెడ్డి 39 పాయింట్లు సాధించి రెండు పాయింట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్నది. కాగా, రంగారెడ్డి జట్టు క్రీడాకారులు , అభిమానుల సంబురాలతో మైదానం హోరెత్తింది. అలాగే బాలుర విభాగంలో నల్గొండ జట్టుపై రంగారెడ్డి జట్టు 37-26 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్హెగ్డే, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్యాదవ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ తిరుపతి చేతుల మీదుగా విజేత జట్టుకు బహుమతిని ప్రదానం చేశారు. ఇక్కడ అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, కరీంనగర్ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సంపత్రావు, కబడ్డీ అసోసియేషన్ నిర్వాహకులు, పోలీసు అధికారులు ఉన్నారు.