కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 12: సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని టీపీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సూచించారు. శాతవాహన యూనివర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో ఎస్సీ, ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మహనీయుల జయంత్యుత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వీసీ ప్రొఫెసర్ మల్లేశ్ సంకశాలతో కలిసి మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే, అంబేదర్, జగ్జీవన్‌రామ్ ఆశయాలకు అనుగుణంగా సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విశిష్ట అతిథిగా హాజరైన ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ పూర్వ సంచాలకుడు ఆచార్య చెన్న బసవయ్య మాట్లాడుతూ, జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే జీవితాలను విద్యా ప్రణాళికలో భాగంగా చేసుకోవాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రిజిస్ట్రార్ డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ, మహనీయుల జయంతిని యూనివర్సిటీల్లో జరుపుకోవడం హర్షణీయమన్నారు. అనంతరం, డాక్టర్ వన్నాల రమేశ్, డాక్టర్ కే పద్మావతి తదితరులు ప్రసంగించారు. వివిధ కళాశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలను బహుమతులతో సతరించారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎన్వీ శ్రీరంగప్రసాద్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాఫర్ జరీ, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయంతి, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మనోహర్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.