కరీంనగర్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :‘వరి ఎంతైనా సాగు చేయండి. కేంద్రం ద్వారా మేం ధాన్యం కొనుగోలు చేయిస్తం. అది మా బాధ్యత. ఎవరూ భయడాల్సిన అవసరం లేదు.’ అంటూ యాసంగి సీజన్ ప్రారంభంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు బీరాలు పలికారు. కొనుగోలు చేయించే బాధ్యత తమదేనంటూ.. ప్రెస్మీట్లు పెట్టి మరీ డాంబికాలు ప్రదర్శించారు. తీరా పంట చేతికి వస్తున్న ప్రస్తుత సమయంలో కేంద్రం కొర్రీలు పెడుతుంటే ఒక్కరూ ఒక్క మాట అనకపోగా.. తిరిగి కేంద్రానికి వత్తాసు పలుకుతున్నారు. నాడు ఏ పంటైనా కొంటామని చెప్పి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ.. అవహేళన చేస్తున్నారు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి నూకలు తినండంటూ రాష్ట్ర ప్రజలను అవమానించినా.. ఒక్కరూ మాట్లాడకపోవడం వారి డొల్లతనాన్ని బయటపెట్టింది. అంతేకాదు.. యాసంగి పంట సమయంలో నోరువిప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు మాత్రం.. తలో మాట మాట్లాడుతూ కేంద్రం బాటలో నడుస్తున్నారు. పంటలు పండించిన రాష్ట్ర రైతులకు అండగా నిలువకుండా.. ధోకా బాజీ మాటలు చెబుతున్నారు. ఆనాడు కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని చెప్పి.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ విషంగక్కుతున్నారు. మొత్తంగా చూస్తే ధాన్యం కొనుగోలు విషయంలో కాషాయ పార్టీ తన కపట నాటకాలను బయట పెట్టినా.. సీఎం కేసీఆర్ మాత్రం అండగా నిలుస్తున్నారు.
3వేల కోట్లు అవసరమని అంచనా..
యాసంగి ధాన్యం కొనుగోలు చేయడానికి ఉమ్మడి జిల్లాలో సుమారు 3వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. గతేడాది యాసంగి పంట కొనుగోలుకు 3,500 కోట్లు అవసరమయ్యాయి. ఈ సారి ఇతర పంటలు వేయాలని ప్రభుత్వం సూచించడంతో గతంతో పోలిస్తే కొంత మేరకు వరి సాగు తగ్గింది. ఉమ్మడి జిల్లాలో 7.53 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 18.33 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అంచనా వేశారు. గతేడాది యాసంగిలో 1317 కొనుగోలు కేంద్రాలు చేశారు. ఈ సారి 1300 వరకు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగానే.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు నాలుగు రోజుల్లో అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.
తొలిగిన ఉత్కంఠ..
రోజురోజుకూ మారుతున్న పరిణామాలు, కేంద్రం మొండి వైఖరి నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన ఇన్నాళ్లూ రైతుల్లో ఉండేది. ఇదే సమయంలో కేంద్రం మాట తప్పినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ కొని తీరుతారన్న నమ్మకం కనిపించేది. చివరికు అన్నదాత విశ్వాసమే నిజమైంది. రైతును రాజును చేసేందుకు ఎన్నో విప్లవాత్మక పథకాలు అమలు చేసి.. వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చిన కేసీఆర్.. ఇప్పుడూ అదే కోవలో రైతుల పక్షాన నిలిచారు. చేతులెత్తేసిన కేంద్రంపై ఒక వైపు పోరు చేస్తూనే.. యాసంగిలో పండిన ప్రతి గింజనూ కొనాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంగళవారం రాత్రి ప్రకటించి, గత కొన్నాళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. ప్రతి గ్రామానికో కేంద్రం ఏర్పాటు చేసి రేపటి నుంచే కొంటామని చెప్పడంతో ఉమ్మడి జిల్లా రైతులు ఆనందంలో మునిగిపోయారు. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తూనే.. చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. గంగాధర మండలం బూరుగుపల్లిలో నిర్వహించిన సంబురాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. రైతులతో కలిసి సీఎం కటౌట్‌కు పాలాభిషేకం చేశారు.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్..
వడ్ల కొనుగోలుపై బీజేపోళ్లు కొంతకాలంగా అనవసర రాద్ధాంతం చేసిన్రు. పూటకో మాట చెబుతూ ఆగం పట్టించిన్రు. అటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా టీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆందోళన చేసినా పట్టించుకోలె. రాష్ట్ర మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను ప్రాధేయపడ్డా కనికరించలేదు.. యాసంగిలో వరి వేయండి అని రైతులను రెచ్చగొట్టిన బండి సంజయ్ తప్పించుకు తిరుగుతున్నడు. డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నడు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామని ప్రకటించి రైతుబాంధవుడుగా నిలిచిన్రు.. మరోసారి రైతుపక్షపాతినని నిరూపించిన్రు..ఆయనకు రైతాంగం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.
– బూరుగుపల్లిలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
రైతుకు శుభ పరిణామం
కేంద్రం వడ్లు కొనకపోయినా గ్రామాల్లో ఎప్పటిలెక్కనే కొనుగోలు కేంద్రాలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వమే కొంటదని సీఎం కేసీఆర్ ప్రకటించడం శుభ పరిణామం. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, వడ్లు కొనుగోలు చేయమని కొర్రీలు పెట్టడంతో రైతులు ఆందోళన పడ్డరు. కేంద్రం మొండికేసినా, ఇక్కడి బీజేపీ నాయకులు రైతుల పక్షాన మాట్లాడకపోయినా రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ధాన్యం కొంటామని ప్రకటించి మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నరు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొంటామని ప్రకటించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటం.
– వేముల దామోదర్, కాసారం(గంగాధర)
రైతులందరికీ ధైర్యం..
మాది మక్తపల్లి, మాకు మా ఊళ్లెనే ఐదు ఎకరాల పొలం ఉంది. అందుల వరి తప్ప వేరే పంట పండది. యాసంగి అని దొడ్డు వరే వేసిన. ఎయ్యంగ ఏసిన కనీ, కోతకు వచ్చే టైం దగ్గరపడ్డ కొద్దీ రోజూ టెన్షనైంది. వేలవేలకు పెట్టుబడి పెట్టి వరి పంట వేస్తే కేంద్రం వడ్లు కొనం అని మొండికెయ్యవట్టె అనిపించింది. వాళ్లు చేసే చేసుడుకు, మాట్లాడే మాట్లాడుడుకు వరెయ్యక బీడువెట్టినా మంచిగుండు అనిపించింది. కనీ, సీఎం కేసీఆర్ సార్ ఏదోటి చేసి కేంద్రంతోని కొనిపిచ్చుడో.. ఆయనే కొనుడో చేస్తడనే ధైర్యం ఎక్కన్నో ఓ మూలకు ఉండె. అది నిజం చేసిండు. సీఎం సార్ వడ్లు కొంటం అని ప్రకటించినంక నిజంగా ధైర్యం వచ్చింది. నాకే కాదు తెలంగాణ రైతులందరికీ ఒక పెద్ద ధైర్యం.
– గాండ్ల శ్రీనివాస్, యువరైతు, మక్తపల్లి (తిమ్మాపూర్ రూరల్)
బీజేపోళ్లు ఆగంజేసిన్రు..
ముఖ్యమంత్రి సారు మొదటి నుంచి రైతుల మంచి గోరుతున్నడు. ఆంధ్రాల ఉన్నప్పుడు మత్తు గోసెళ్లదీసినం. ఎరువుల కోసం లైన్లు గట్టినం. కరెంట్ రాక పంటలు ఎండిపోయి నష్టపోయినం. కేసీఆర్‌తోనే మా బతుకులు మారినయ్. పసలుకోసారి పెట్టుబడికి పైసలిత్తున్నడు. కరెంట్ గూడా ఉత్తగనే ఇత్తున్నడు. ప్రాజెక్టులు, కాలువలు కట్టి ఎండళ్ల గూడా పంటలకు నీళ్లిత్తున్నడు. పంటలు మంచిగ పండుతున్నయ్. గిట్ల అంత మంచిగున్నదనుకుంటున్న టైంల బీజేపోళ్లు రైతులను ఆగం జేసిడ్రు..వడ్లు కొనమంటూ కిరికిరి చేసిండ్రు..ముఖ్యమంత్రి మొత్తుకున్నా పట్టించుకోలేదు.. ఇగ వాళ్లతో గాదని చెప్పి కేసీఆర్ సారే కొనేందుకు ముందుకు వచ్చిండు.. ఆయన్ను నమ్ముకొనే వరేసిన..
– గోపతి ఎర్ర మల్లయ్య, రైతు (ఓదెల)
రంది లేకుంటైంది..
నీటి సౌలతి ఉన్నదని నాకున్న తొమ్మిదెకరాల భూమిల వరి సాగు చేసిన. ఇప్పుడు కోతకు వచ్చింది. కేంద్రం వడ్లు కొనేది లేదన్నంక ఎట్ల అమ్ముకునుడో అర్థంకాక అందోళన పడ్డ. కానీ, సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వమే కొంటదని చెప్పినంక రంది లేకుంటైంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే అందరికీ మద్దతు ధర దక్కుతది. కేంద్రమోళ్లు ఎంత మొండికేస్తున్నా రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నడు. సారుకు ధన్యవాదాలు.
– తక్కళ్ల ఎల్లారెడ్డి, రైతు, మామిడిపల్లి (కోనరావుపేట)
పాణం లేసొచ్చింది..
ఈ యాసంగిలో నాకున్న ఆరెకరాల్లో వరి వేసిన. ఇప్పుడు కోతకు వచ్చింది.. ధాన్యం కొనాలని టీఆర్ఎస్తో కలిసి రైతులందరూ ఆందోళన చేసినా కేంద్రం పట్టించుకోలేదు. ధాన్యం కొనుగోలుపై ఎటువంటి ప్రకటన జేయకపోవడంతో మస్తు పరేషాన్ అయిన. లాగోడి గూడా వత్తదో లేదోనని భయపడ్డ.. కానీ ఇయ్యాళ్ల ప్రతి పంట గింజనూ కొంటమని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో పాణం లేసొచ్చింది. కొనుగోలు కేంద్రాలు పెడుతామని చెప్పిన ముఖ్యమంత్రి సారుకు ధన్యవాదాలు..
– రాచూరి ఆంజనేయులు, రైతు, మండలకేంద్రం (పెగడపల్లి)