కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 12: కళాశాలలు, యూనివర్సిటీల్లో పరిశోధనాంశాలు పెంచాలని, మౌలికంగా పరిశోధనలు కొనసాగితే ప్రభుత్వాలు మరిన్ని నిధులు మంజూరు చేస్తాయని కర్నాటక ఆదిచెంచునగారి విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య బైరప్ప పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ‘పరిశోధన పద్ధతులు’ అంశంపై నిర్వహించిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. దేశం స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 0.69% శాతం నిధులను మాత్రమే పరిశోధనల కోసం ఖర్చు చేస్తోందన్నారు. హైదరాబాద్ వీవీ కళాశాల ప్రొఫెసర్ శ్రీనివాస్ రావు ప్రధాన వక్తగా హాజరై పరిశోధనలో గల విభిన్న పద్ధతులను వివరించారు. పరిశోధనల స్వభావాన్ని బట్టి పద్ధతులను ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. సాయంత్రం నిర్వహించిన ముగింపు సమావేశానికి శాతవాహన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డా. ఎన్వీ రంగప్రసాద్ ముఖ్య అథితిగా హాజరై, కార్యశాల ప్రతినిధులకు మార్గనిర్దేశనం చేశారు. మానవాళి మనుగడలో పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. వ్యక్తిగతంగా చేసే పరిశోధనల కంటే సంస్థాగత భాగస్వామ్యంతో చేసే పరిశోధనలు సమాజానికి మేలు చేస్తాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కే రామకృష్ణ మాట్లాడుతూ, పరిశోధనల కోసం అవకాశాలు విరివిగా అందుబాటులో ఉన్నాయన్నారు. ఉన్నత విద్యలో అధ్యాపకుల పరిశోధనలు విద్యార్థులకు సైతం మేలు చేస్తాయన్నారు. అనంతరం కార్యశాల నిర్వాహకురాలు ఎం అర్చన, కొమురయ్య అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పవన్‌కుమార్, ఎలిజబెత్ రాణి, చౌదరి, శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, కృష్ణవేణి, గీత, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.