హుజూరాబాద్ టౌన్, ఏప్రిల్ 10: హుజూరాబాద్ పట్టణాభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. హుజూరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని ప్రధాన రహదారులను శుభ్రపరిచేందుకు గానూ పట్టణ ప్రగతి నిధులు రూ.83 లక్షలతో స్వీపింగ్ మిషన్(ఊడ్చే యంత్రం) కొనుగోలు చేయగా, దానిని ఆదివారం ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అంతకుముందు మంత్రికి కరీంనగర్రోడ్డులోని ఆటోనగర్ నుంచి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మంత్రి స్వీపింగ్ మిషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు హుజూరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. పట్టణ ప్రగతి కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు గందె రాధికా శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ దంపతులు కొలిపాక నిర్మలాశ్రీనివాస్ దంపతులు, బల్దియా కమిషనర్ వెంకన్న మంత్రి గంగులను, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.