ఇల్లందకుంట, ఏప్రిల్ 10: అపరభద్రాదిగా పేరుగాంచిన ఇల్లందకుంట దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్ర్తోక్తంగా సాగిన వేడుకలను తిలకించేందుకు భక్తజనం భారీగా తరలివచ్చింది. కల్యాణంలోని ప్రతి ఘట్టాన్ని భీమవరం శ్రీ భాష్యకర సిద్ధాంత పీఠం శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వివరించగా, ప్రతి ఒక్కరిలో భక్తిభావం ఉప్పొంగింది. కల్యాణోత్సవం సందర్భంగా సీతారామచంద్రస్వామి వార్లకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు, సీతారామాచార్యులు కల్యాణం జరిపించారు.
జమ్మికుంట రైస్, కాటన్మిల్లర్ల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా మజ్జిగను పంపిణీ చేశారు. కల్యాణోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా హుజూరాబాద్ ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత, ఎంపీటీసీ విజయ, టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్, ఆలయ ప్రత్యేకాధికారి చంద్రశేఖర్, ఆలయ ఈవో కందుల సుధాకర్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, ఆర్డీవో ఆనంద్‌కుమార్, తహసీల్దార్లు సురేఖ, సరిత, శ్రీనివాస్, సీఐలు సురేశ్, రాంచంద్రరావు, ఎస్ఐ తిరుపతి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులతో పాటు వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.