కలెక్టరేట్, ఏప్రిల్ 10: పసిపిల్లలతో కొనసాగిస్తున్న భిక్షాటనను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ నగరంలో సత్ఫలితాలనిస్తున్నది. నాలుగు రోజులుగా రెస్క్యూ బృందాలు నిరంతరం చేపడుతున్న తనిఖీలతో చిన్నారులతో చేయిస్తున్న భిక్షాటన నిలిచింది. అధికారులు నగరంలో అధికంగా జనాలుండే ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. పసిపిల్లలతో భిక్షాటన చేస్తు న్న వారి ఆటకట్టిస్తుండగా, నిత్యం నగరానికి వచ్చిపోయేవారు ఊపిరి పీల్చుకుంటున్నారు. పిల్లలను చైల్డ్ హోమ్‌కు తరలిస్తున్నారు. పెద్దవారిపై కేసులు నమోదు చేసి ఠాణాలకు తరలిస్తున్నారు. దీంతో, బెగ్గింగ్ ముఠాలు నగరం నుంచి జారుకుంటున్నా యి. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి చిన్న పిల్లలతో భి క్షాటన చేయిస్తున్న వారంతా ముల్లేమూట సర్దుకుని స్వస్థలాలకు తిరుగుముఖం పడుతున్నారు.
ఈజీ మనీకి అలవాటు పడి..
ఈజీ మనీకి అలవాటు పడ్డ ఇతర రాష్ర్టాలకు చెందిన కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల నుంచి చిన్న పిల్లలతో సహా నగరానికి వచ్చారు. మురికి వాడలు, నగర శివార్లలో నివాసమేర్పరుచుకుని చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్నారు. పలకాబలపం పట్టి పాఠశాలకు వెళ్లాల్సిన వయసులో నగర కూడళ్లు, జనం అధికంగా ఉండే ప్రాంతాలు, ముఖ్య కూడళ్లు, మార్కెట్లు, రద్దీ అధికంగా ఉండే పలుచోట్ల చిన్నారులతో మాస్కులు, ఇయర్‌బడ్స్, హాండ్ కర్చిప్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మిస్తున్నారు. మరికొందరితో వాహనాలను శుభ్రం చేయిస్తున్నారు. వందల సంఖ్యలో మహిళలు చంటి పిల్లలనెత్తుకుని భిక్షాటన చేస్తూ, పసిపిల్లల బాల్యాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఎండనకా, వాననకా.. దుమ్ము, ధూళిలో తిప్పుతూ చిన్నారులను చిరుప్రాయంలోనే చిదిమేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో అందిస్తున్న రెసిడెన్షియల్ విద్యను కూడా వారికి దూరం చేస్తూ, వారి జీవితాలను అంధకారంలోకి నెట్టివేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
పలు స్వచ్ఛంద సంస్థలు కూడా బెగ్గింగ్ మాఫియాపై చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, చైల్డ్‌లైన్ 1098తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలతో కలిపి అధికారులు రెస్క్యూ బృందాలు ఏర్పాటు చేశారు. ఈనెల 6నుంచి ఈ బృందాలు నగరంలో తనిఖీలు చేపడుతూ, చిన్న పిల్లలతో భిక్షాటన, వెట్టి చాకిరీ చేయించే వారిని గుర్తించి, వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాయి. అయినా వినని వారిపై పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నాయి. ఇప్పటివరకు నగరంలో చిన్న పిల్లలతో కలిసి భిక్షాటన చేస్తున్న 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. చిన్న పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఎదుట హాజరుపరిచి, చైల్డ్ హోమ్‌కు తరలిస్తున్నారు. రెస్క్యూ టీముల చర్యలతో బెంబేలెత్తుతున్న భిక్షాటన బృందాలు వచ్చిన దారిలోనే వెనుదిరుగుతున్నట్లు పేర్కొంటున్నారు.
చిన్న పిల్లలతో భిక్షాటన నేరం
చిన్నారులతో భిక్షాటన చేయించడం నేరం. కొంతమంది ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి పిల్లల ప్రాథమిక హక్కులను హరిస్తూ ఎండ, వానలో తిప్పుతున్నారు. చిరుప్రాయంలోనే వారి ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ముందుగా భిక్షాటన చేసే వారిని గుర్తించి కౌన్సెలింగ్ చేస్తున్నాం. వినకపోతే కేసులు నమోదు చేయిస్తున్నాం. దీంతో కొద్దిరోజులుగా బెగ్గింగ్ టీములు నగరం నుంచి వెళ్లిపోతున్నాయి.
– వీ.పద్మావతి,
చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ అధికారి, కరీంనగర్