కరీంనగర్, ఏప్రిల్ 9 (నమ స్తే తెలంగాణ)/ రామడుగు :ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరోసారి జాతీయస్థాయిలో మెరిసింది. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే ‘దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్’లో తనదైన ముద్రవేసింది. రాష్ర్టానికి మూడు కేటగిరీల్లో 16 అవార్డులు రాగా, అందులో ఎనిమిది అవార్డులు మనకే దక్కాయి. అందులో ఒక జిల్లా పరిషత్, రెండు మండల పరిషత్‌లు, ఐదు గ్రామ పంచాయతీలకు పురస్కారాలు వరించాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతోపాటు ‘పల్లె ప్రగతి’ ఇందుకు స్ఫూర్తిగా నిలుస్తుండగా, అవార్డులు రావడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించే దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ అవార్డుల్లో ఉమ్మడి జిల్లా మరోసారి మెరిసింది. మూడు కేటగిరీల్లో 16 అవార్డులు రాగా, అందులో ఎనిమిదింటిని సొంతం చేసుకున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా మూడు, పెద్దపల్లి జిల్లా మూడు, కరీంనగర్ జిల్లా ఒకటి, జగిత్యాల ఒక పురస్కారాన్ని దక్కించుకున్నాయి. అందులో ఒక జిల్లా పరిషత్, రెండు మండల పరిషత్‌లు, ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏప్రిల్ 24న నిర్వహించే ‘జాతీయ పంచాయతీ దివస్’ రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. జిల్లా ప్రజా పరిషత్‌లకు 50 లక్షలు, మండల పరిషత్‌లకు 25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన 5 లక్షల నుంచి 15 లక్షల వరకు నగదు పురస్కారాలు అందించనున్నారు. అవార్డులు రావడంపై పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల కలెక్టర్లు కలెక్టర్ డా సర్వే సంగీత సత్యనారాయణ, అనురాగ్ జయంతి, ఆర్వీ కర్ణన్, రవితోపాటు సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఎంపీడీవోలు రాజు, పద్మజ, ఎంపీపీలు బండారి స్రవంతి శ్రీనివాస్, మేన్నేని స్వర్ణలత, పంచాయతీల సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు.
స్ఫూర్తిగా పల్లె ప్రగతి
కేంద్రం ప్రకటిస్తున్న జాతీయ స్థాయి అవార్డులను ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరోసారి దక్కించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు స్ఫూర్తిగా నిలిచాయి. అవార్డుల ఎంపిక కోసం తీసుకున్న అంశాల్లో ఎక్కువ శాతం ఈ కార్యక్రమాల ద్వారా చేపట్టిన పనులే ఇమిడి ఉన్నాయి. హరితహారం, పల్లె ప్రకృతి వనాలు దోహదపడుతున్నాయి. పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేయడం, చెత్త సేకరణకు ప్రతి పంచాయతీ ఒక ట్రాక్టర్ సమకూరడంతో గ్రామా లు శుభ్రంగా మారాయి. మిషన్ భగీరథ ద్వారా ప్రతి పల్లెకు స్వచ్ఛమైన తాగునీటి వనరులు లభిస్తున్నాయి. పారిశుధ్యంలో కీలమైన సెగ్రిగేషన్ షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణంలో కూడా ఉమ్మడి జిల్లా ముందంజలో ఉన్నది. పారిశుధ్యం, మానవ వనరుల అభివృద్ధి సూచిక కింద ఉమ్మడి జిల్లాలో వైకుంఠధామాలను ఏర్పాటు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకున్న అంశాలన్నింటికీ ఉమ్మడి జిల్లా సరితూగుతున్నది.
వరుసగా అవార్డులు..
ఉమ్మడి జిల్లా జాతీయ స్థాయిలో ఎప్పటి నుంచో చోటు దక్కించుకుంటున్నది. వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకుని ప్రథమంగా ఓడీఎఫ్ పరిధిలోకి వచ్చింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తున్న అవార్డులకు వరుసగా ఎంపికవుతున్నది. 2016-17లో శ్రీరాంపూర్ మండల పరిషత్, వెలిచాల, దుద్దెనపల్లి, ముష్టిపల్లి గ్రామాలకు అవార్డులు దక్కాయి. 2017-18లో మంథని, వెల్గటూర్ మండల పరిషత్‌లు, రాఘవాపూర్ గ్రామ పంచాయతీకి వచ్చాయి. 2018-19లో సుల్తానాబాద్ మండల పరిషత్, కిష్టంపేట, గంగారం, ఆదివారంపేట, నుస్తులాపూర్ గ్రామ పంచాయతీలు అవార్డులకు ఎంపికయ్యాయి. 2019-20లో కోరుట్ల, ధర్మారం మండల పరిషత్‌లు, పర్లపల్లి, హరిదాస్‌నగర్, మోహినికుంట గ్రామాలతోపాటు సుందిళ్ల రెండు అవార్డులు సొంతం చేసుకున్నాయి.
మంత్రి కేటీఆర్ అభినందన
స్వరాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మెరిసిపోతున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఆదర్శంగా రూపుదిద్దుకున్నది. రాష్ట్ర సర్కారు అభివృద్ధి పనులు, పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో నిలుస్తున్నది. మొక్కల పెంపకం, పరిశుభ్రత, పారిశుధ్యం, తాగునీరు.. ఇలా 43 అంశాల్లో మెరుగైన పనితీరు కనబరుస్తూ ఏటా కేంద్రం నుంచి అవార్డులు దక్కించుకుంటుంది. తాజాగా సిరిసిల్ల జిల్లా పరిషత్, ముస్తాబాద్ మండలం మద్దికుంట, తంగళ్లపల్లి మండలం మండపల్లి పంచాయతీలు పురస్కారాలను సొంతం చేసుకోగా, మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అధికారులు, పాలకవర్గాల సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
సమష్టి కృషితోనే అభివృద్ధి
సమిష్టి కృషితో చేపట్టిన అభివృద్ధితోనే వెలిచాలకు ఉత్తమ జాతీయ పంచాయతీ అవార్డు వచ్చింది. ముఖ్యంగా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిద్దిడంలో అధికారులతో పాటు తోటి పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజల సహకారం ఉంది. గ్రామాన్ని పచ్చదనం, పరిశుభ్రతలో ఉమ్మడి జిల్లాకే ఆదర్శంగా నిలుపాలన్నది మా సంకల్పమే ఈరోజు మా గ్రామాన్ని ఉన్నత స్థాయిలో ఉంచింది. ఏడు పదుల వయసులోనూ గ్రామ సమస్యలు పరిష్కరించడంలో ఏరోజూ నేను అలసిపోలేదు. ప్రతిరోజూ వీధివీధినీ సందర్శించి, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకొని వార్డు సభ్యుల సహకారంతో పరిష్కరించే వరకు నిద్రపోను. ముఖ్యంగా పచ్చదనం కోసం గ్రామంలో ప్రతి వీధిలో ఆహ్లాదాన్ని అందించే మొక్కలు నాటించాం. ఇంటింటికీ ఇంకుడుగుంతల నిర్మాణం వందశాతం పూర్తి చేశాం. అంతర్గత దారులకు ఇరువైపులా గడ్డి, పిచ్చి మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నాం. మా గ్రామం పట్టణ అందాలను తలపించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం.
– వీర్ల సరోజన, సర్పంచు, వెలిచాల (రామడుగు)