గన్నేరువరం, ఏప్రిల్ 9: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని చొక్కరావుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. దళితుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. గత ప్రభుత్వాలు దళితుల సంక్షేమాన్ని విస్మరించాయని విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరపెల్లి మోహన్, ఆహార భద్రతా కమిషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్, జడ్పీటీసీ మాడుగుల రవీందర్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, వైస్ ఎంపీపీ న్యాత స్వప్నాసుధాకర్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ బద్దం తిరుపతిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అలాగే మండలంలోని గునుకులకొండాపూర్లో భవన నిర్మాణ కార్మికులకు ఈ-శ్రామ్ కార్డులు, పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. టీఆర్ఎస్కేవీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయుల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర కార్యదర్శి మంచె నర్సింహులు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పిండి అరవింద్, జిల్లా కార్యదర్శులు ముస్తాల గణేశ్, బత్తుల రాజశేఖర్, ఉప సర్పంచ్ హనుమాండ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.