జగిత్యాల, ఏప్రిల్ 9, (నమస్తే తెలంగాణ): అన్నిదానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని గుర్తించిన వెల్గటూర్ మాజీ ఎంపీపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పొనుగోటి శ్రీనివాసరావు ఓ నిరుపేద దళిత విద్యార్థినికి అండగా నిలిచారు. వైద్య విద్యకు ఐదేండ్లల్లో అయ్యే అన్ని ఖర్చులను భరించేందుకు ముందుకు వచ్చారు. తక్షణ సాయం కింద రూ.50వేలు అందజేశారు. వివరాల్లోకి వెళి తే.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లికి చెందిన దర్శనాల రాజేశం-జమున దంపతులకు ఇద్దరు కొడుకులు, కుమార్తె. వీరిది నిరుపేద కుటుంబం. రాజేశం, జమున తమ పిల్లలకు కష్టపడి చదివిస్తూ వచ్చారు. అయితే 2008లో రాజేశం మృతిచెందాడు. భర్త మరణం తర్వాత జమున ధర్మపురి ఎస్సీ హాస్టల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కామటిగా పనిచేస్తూ పిల్లలను చదివిస్తున్నది. ఇద్దరు కొడుకులు బీటెక్ కోర్సుల్లో చేరారు.
కూతురు సోఫియా పదో తరగతి దాకా రామగుండం మండలం ప్రభుత్వ పాఠశాలలో చదివి, పదిలో 9.0 జీపీఏ మార్కులు సాధించింది. గ్రేడ్ ఆధారంగా హైదరాబాద్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ సీటు రావడంతో అక్కడే ఇంటర్ పూర్తి చేసింది. ఇంటర్లో 922 మార్కులు సాధించిన సోఫియా నీట్ పరీక్షల్లో ప్రతిభచూపింది. 720 మార్కులకు 463 మార్కులు సాధించడం తో నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫ్రీసీట్ సాధించింది. అయితే ఫ్రీ సీటు కు సంబంధించి ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.23 వేలు, హాస్టల్ ఫీజు ఏడాదికి రూ.17వేలు, మెస్ ఫీజు నెలకు రూ.3,300 చెల్లించాల్సి రావడంతో సోఫియా కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
విషయం తెలుసుకున్న రాజారాంపల్లి సర్పంచ్ శేఖర్.. సోఫియా, జమునను వెల్గటూర్ మాజీ ఎంపీపీ, టీఆర్ఎస్ నాయకుడు పొనుగోటి శ్రీనివాస రావు వద్దకు తీసుకెళ్లి పరిస్థితిని వివరించారు. సోఫియా తన ఎంబీబీఎస్ చదువుకు ఆర్థిక సాయం చేయాలని శ్రీనివాసరావును కోరగా, ఆయన స్పందించారు. తక్షణం ట్యూషన్‌ఫీజు, మెస్ఫీజు, హాస్టల్ ఫీజు కోసం రూ.50వేల నగదు అందజేశారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న శ్రీనివాసరావు, సోఫియా ఎంబీబీఎస్ ఐదేళ్లకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందిన సోఫియా మాట్లాడుతూ.. పెద్దమనసుతో తన ఐదేండ్ల చదువుకు అయ్యే ఖర్చును భరించేందుకు అంగీకరించిన శ్రీనివాసరావుకు రుణపడి ఉంటానన్నారు. భవిష్యత్తులో కష్టపడి చదివి ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు.