విద్యానగర్, ఏప్రిల్ 9: ఉద్యోగులు, సిబ్బంది, సభ్యుల సహకారంతోనే రాష్ట్రంలోని అన్ని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు(డీసీసీబీ) ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. కరీంనగర్‌లోని ఓ హోటల్లో శనివారం తెలంగాణ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ 3వ రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు డీసీసీబీలకు గుర్తింపు లేకపోవడంతో నష్టాలు చవి చూశాయ న్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి చెందుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కొన్ని నెలల క్రితం నష్టాల్లో ఉన్న నిజామాబాద్, మహబూబ్‌నగర్ డీసీసీబీలు ఇప్పుడు లాభాల బాటపట్టాయన్నారు. కరోనా సమయంలో ఉద్యోగులు ప్రాణాలకు తెగించి పనిచేశారని ప్రశంసించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వినియోగదారుల సమావేశంలో పలువురు డీసీసీబీల కంటే మెరుగైన బ్యాంకుల్లేవని, ప్రైవేట్ బ్యాంకుల్లో ఖాతాలను మూసివేస్తామని చెప్పడం సంతోషమనిపించిందన్నారు.
రైతు వ్యతిరేక విధానాలతో సహకార రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ఇది మేకిన్ ఇండియా కాదని, ఇది కేవలం బేచో ఇండియా (ఇండియాను విక్రయించండి) అనేదే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యొక్క నినాదం అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కరీంనగర్ డీసీసీబీ ఉద్యోగులు దేశంలోనే రోల్ మాడల్‌గా నిలిచి రూ. 68.08 కోట్లు లాభాలు ఆర్జించారన్నారు. కార్యక్రమంలో వరంగల్ డీసీసీబీ చైర్మన్ ఎం రవీందర్రావు, మెదక్, ఖమ్మం, చైర్మన్లు దేవేందర్‌రెడ్డి, నాగభూషణయ్య, కరీంనగర్ వైస్ చైర్మన్ పి రమేష్, మేనేజింగ్ డైరెక్టర్ మురళిధర్, చైర్మన్ జనార్దన్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశం, ప్రధాన కార్యదర్శి సురేందర్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చలం, కార్యదర్శిరాంబాబు లు పాల్గొన్నారు.