కరీంనగర్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రైతును అరిగోస పెడుతున్న కేంద్రానికి వడ్ల సెగ తగిలేలా గులాబీ దళం కదం తొక్కింది. యాసంగి ధాన్యం కొనేదేకా వదిలేదే లేదంటూ అన్నదాత పక్షాన శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించింది. టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులు స్వచ్ఛందంగా తమ ఇండ్లపై నల్లజెండాలు ప్రదర్శించగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అన్నదాతకు మద్దతుగా యువకులూ కదిలారు. ప్రజాప్రతినిధులు, వందలాది మంది నాయకులు, కర్షకులతో కలిసి పట్టణాల్లో బైక్ ర్యాలీలు తీశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి, బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కరీంనగర్లో రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తమ ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేసి, మోదీ సర్కారు తీరుపై విరుచుకు పడ్డారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నల్ల జెండాలు ఎగిరాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ రైతు ఇంటిపై చూసినా రెపరెపలాడాయి. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉదయమే నల్ల జెండాలను సిద్ధం చేసుకుని ఇంటిపై కట్టి నిరసన తెలిపారు. మోదీ సర్కారు ధాన్యం కొనే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నల్లచొక్కా ధరించి తన ఇంటిపై నల్ల జెండా ఎగుర వేశారు.
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనేదాకా ఇదే విధంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. నగర మేయర్ వై సునీల్‌రావు తన క్యాంపు కార్యాలయంపై నల్ల జెండా ఎగుర వేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మానకొండూర్‌లోని తన ఇంటిపై నల్ల జెండాను ఎగురవేసిన అనంతరం స్థానికంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. కరీంనగర్ మండలం దుర్శేడులోని రైతులు తమ ఇండ్లపై సామూహికంగా నల్ల జెండాలు ఎగుర వేశారు.
కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లోనూ ఇలాగే నిరసన వ్యక్తం చేశారు. కొత్తపల్లిలో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు తన ఇంటిపై జెండా ఎగురవేశారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజీవ్ రహదారిపైకి నల్ల జెండాలతో వచ్చి నిరసన తెలిపారు. ప్రధాని దిష్టి బొమ్మను దహనం చేశారు. గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్‌లో ఆర్బీఎస్ కన్వీనర్ గూడెల్లి తిరుపతి తన ఇంటిపై నల్ల జెండా ఎగుర వేసి నిరసన తెలిపారు. గన్నేరువరంలో ప్రధాని దిష్టి బొమ్మను దహనం చేశారు. చిగురుమామిడిలో ర్యాలీ నిర్వహించి, ప్రధాని దిష్టి బొమ్మను దహనం చేశారు. శంకరపట్నంలోనూ ఇదే తరహాలో నిరసనలు తెలిపారు.
హుజూరాబాద్‌లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక తమ ఇండ్లపై నల్ల జెండాలు ఎగుర వేశారు. పలువురు కార్యకర్తలు వార్డుల్లో ర్యాలీగా వెళ్తూ రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఇండ్లపై నల్ల జెండాలు ప్రదర్శించారు. జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు తన ఇంటిపై నల్ల జెండాను ఎగుర వేశారు. చొప్పదండిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాల ప్రదర్శన జరిగింది. స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ తన ఇంటిపై నల్ల జెండా ఎగుర వేసి నిరసన తెలిపారు. గంగాధర, రామడుగు మండలాల్లోనూ రైతులు తమ ఇండ్లపై నల్ల జెండాలు ఎగుర వేసి, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఉప్పు పుట్నాలకు అమ్ముకోవాల్సి వత్తది..
కేంద్రం వడ్లు కొనకుంటే రైతుల బతుకు ఆగమైతది.. ఒక్కొక్కళ్లకు లచ్చల రూపాయల నష్టం వత్తది. దళారులకు ఉప్పు పుట్నాలకు అమ్ముకోవాల్సి వత్తది. తినే తలెను అమ్మి చెప్పులు కొన్నట్టుంటది. మంచిగ నీళ్లున్నయని వరి వస్తే ఇప్పుడు మోదీ సర్కార్ పరేషాన్ జేత్తున్నది. భూమిని నమ్ముకుని బతికే రైతులకు తెలంగాణ ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నది. పెట్టుబడికి పైసలిత్తున్నది. 24 గంటల కరెంట్ ఇత్తున్నది. ప్రాజెక్టులు కట్టి పంటలకు సరిపోయేన్ని నీళ్లిస్తున్నది. కానీ ఢిల్లీ సర్కారు రాజకీయాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌ను బద్నాం చేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. అన్ని రాష్ర్టాలలెక్కనే తెలంగాణలో కూడా వడ్లు కొనాలె. లేకుంటే వచ్చే ఎలచ్చన్లన్ల ఓటుతో దెబ్బకొడతం.
-గూడూరి జనార్దన్‌రెడ్డి, రైతు (హుజూరాబాద్)
ముడి బియ్యమంటూ వంకలు పెట్టద్దు..
సుల్తానాబాద్‌రూరల్, ఏప్రిల్ 8: నా పేరు జొంగొని సదయ్యగౌడ్..మా ఊరు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి. నాకు ఐదెకరాల భూమి ఉన్నది. మరో ఐదెకురాలు కౌలుకు తీసుకొని మొత్తం పదెకరాల్లో వరి వేసిన. పంట గూడా బాగా పండింది. 300 కింటాళ్ల దాకా వత్తుంది. దగ్గర దగ్గర ఆరు లక్షలు వత్తయ్. కానీ కేంద్రం వడ్లు కొనకుంటే బతుకు ఆగమైతది. పాలేరుకు వచ్చే జీతం గూడా రాదు. ఊరిడిచి బతుకుదెరువుకు దుబాయ్‌కో, బొంబాయికో పోవాల్సి వత్తది. కేంద్రం ముడిబియ్యం అంటూ వంకలు పెట్డడం మంచిదికాదు. మట్టిల బొర్రి, మట్టిని మింగి పంటలు పండించిన రైతులను ముంచడం ఎంత వరకు కరెక్ట్. ఎలచ్చన్లప్పుడు రాజకీయాలు చేయాలె..పంటలు చేతికొచ్చిన ఈ టైంల పరేషాన్ జేసుడేంది. అయినా ఇన్నేండ్ల సంది లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు అత్తంది.
–జొంగొని సదయ్యగౌడ్, రైతు, తొగర్రాయి (సుల్తానాబాద్‌రూరల్)
వడ్లు కొనకుంటే ఉసురు తగుల్తది..
సెంటరోళ్లు వడ్లు కొనబోమంటూ తెలంగాణ రైతులను ఇబ్బందిపెడుతున్నది. రాజకీయాల కోసం కక్ష కడుతున్నది. దేశంల ఎక్కడాలేని రూల్స్ పెట్టి పరేషాన్ జేత్తున్నది. ఇది ఎంతమాత్రం మంచిదిగాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఎన్నోసార్లు ప్రధానికి లేఖ రాసినా లెక్కజేయకపోవడమేంది. మా కష్టాన్ని పట్టించుకోకుండా ఇబ్బందిపెడితే ఊరుకునేది లేదు. మమ్నల్ని రోడ్డున పడేస్తే ఉసురు తగుల్తది. తెలంగాణ రైతుల శాపనార్ధాలు మోదీకి తగులుతాయి.
–కేతిరెడ్డి రవీందర్‌రెడ్డి, రైతు, నిజామాబాద్ (కోనరావుపేట)
రైతులను అరిగోస పెడుతున్నది..
కేంద్ర ప్రభుత్వం వడ్ల పంచాయితీ పెట్టి రైతులను అరిగోస పెడుతున్నది. కష్టపడ్డ కర్షకులను ఇబ్బందిపెట్టుడు బీజేపోళ్లకు తగదు. రాష్ట్రంల పండిన వడ్లను మొత్తం కేంద్రం కొనాల్సిందే. నేను మా గ్రామ శివారుల 6ఎకరాల్లో వరి వేసిన. ధాన్యం గూడా బాగా పండింది. అయితే కొనమంటూ కేంద్ర సర్కారు తెలంగాణ రైతులను దెబ్బతీయాలని చూస్తున్నది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు రైతుబంధుతో రైతులంతా సంతోషంగా ఉన్నరు. ఇది చూసి కన్నుకుట్టే మోదీ ప్రభుత్వం రైతులను ఇబ్బందుల పాలు చేయాలని సూత్తున్నది. ఇప్పుడన్నా ఆలోచించి పంట గింజలను కొనాలి.
–బండ మల్లారెడ్డి ,రైతు.లక్ష్మీపురం (కాల్వశ్రీరాంపూర్)
వడ్లు కొనేదాకా పోరాడుతాం
కేంద్రం తెలంగాణ రైతాంగంపై వివక్ష చూపుతున్నది. మోదీ సర్కారు యాసంగి వడ్లు కొనబోమంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నది. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నది. ఇక్కడి బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే వడ్లను కొనుగోలు చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలి. ఇప్పటికైనా కేంద్రం దిగొచ్చి ధాన్యాన్ని కొనాలి. లేదంటే రైతుల పక్షాన రాజీలేని పోరాటం చేస్తాం. కేంద్రం బేషరతుగా వడ్లు కొనేదాకా రైతుల ఇండ్లపై ఎగురవేసిన నల్లజెండాలు రెపరెపలాడుతాయి.
– మంత్రి గంగుల కమలాకర్
రైతు నోట్లో మట్టికొట్టే ప్రయత్నం
తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టాలని కేంద్రం చూస్తున్నది. రాష్ట్రం విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నది. ఇక్కడ వానకాలం, యాసంగి వరి మాత్రమే పండుతుందన్న విషయం తెలిసినా.. కేంద్ర ప్రభుత్వం రా రైస్ మాత్రమే తీసుకుంటామని, బాయిల్డ్ రైస్ తీసుకోమని కొర్రీలు పెట్టడం ఇక్కడి రైతులను గోస పెట్టేందుకే. రాష్ర్టాన్ని సాధించి ప్రపంచానికే పోరాట పాఠాలు చెప్పిన కేసీఆర్ నేతృత్వంలో కేంద్రం మెడలు వంచడం పెద్ద విషయం కాదు. తెలంగాణ ఉద్యమ వేడిని మరోసారి కేంద్రానికి చూపుతాం. యాసంగి వడ్లు కొనేదాకా పోరాడుతాం.
-మంత్రి కొప్పుల ఈశ్వర్