విద్యానగర్, ఏప్రిల్ 8: కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందించడం అభినందనీయమని సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ప్రశంసించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కొవిడ్ సేవలందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానను కొవిడ్ దవాఖానగా ఎంపిక చేసింది. సేవలందించిన వైద్యులు, సిబ్బందిని శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో రోగుల కుటుంబీకులు వారితో కలిసి ఉండేందుకు భయపడిన సమయంలో వైద్యులు, సిబ్బంది అక్కున చేర్చుకుని వారి ప్రాణాలను కాపాడారని కొనియాడారు. రాష్ట్రంలోని గాంధీ దవాఖాన తర్వాత ఎక్కువమంది కొవిడ్ పేషెంట్లు చికిత్స పొందింది కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలోనని తెలిపారు.
వైద్యులు, సిబ్బంది కుటుంబాలకు దూరంగా ఉండి నెలల తరబడి సేవలందించడం మరువలేనిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వైద్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతుందని, పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జువేరియా, సుడా సభ్యులు చిగిరి శోభ, ఉదారపు మారుతి, వొల్లాల శ్రీనివాస్, వంగర రవి, నేతి రవి వర్మ, బల్ల ఆంజనేయులు, యూసుఫ్, టీఆర్ఎస్ నాయకుడు శాతరాజు యాదగిరి, కార్పొరేటర్లు సారిల్ల ప్రసాద్, మెండి చంద్రశేఖర్, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్తమ కొవిడ్ దవాఖానగా కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన ఎంపిక కాగా సూపరింటెండెంట్ రత్నమాలను దవాఖాన ల్యాబ్ టెక్నీషియన్లు కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా రత్నమాల మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది టీం వర్క్‌తోనే ఉత్తమ కొవిడ్ దవాఖానగా ఎంపికైందన్నారు. వైద్యులు నవీనా, కార్యాలయ సూపరింటెండెంట్ పుల్లెల సుధీర్, ఫార్మసీ సూపర్వైజర్ భారతి, ల్యాబ్ సిబ్బంది రవీందర్, జవ్వాజి హరికృష్ణ, సాయికృష్ణ, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.