ఇల్లందకుంట. ఏప్రిల్ 8: మండల కేంద్రంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 8నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, హుజూరాబాద్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు శుక్రవారం పరిశీలించారు. ఈవో కందుల సుధాకర్‌కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులకు తాగునీటి వసతి కల్పించామని, చలువ పందిళ్లు వేయించామని చెప్పారు. ఏసీపీ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. భక్తులకు ఇబ్బందులు రాకుండా మూడు మార్గాల్లో పార్కింగ్‌లను ఏర్పాటు చేశామని, భక్తుల రక్షణకు బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో బ్రహ్మోత్సవాలపై హుజూరాబాద్ ఆర్డీవో ఆనంద్‌కుమార్, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వామి వారి కల్యాణం ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సర్పంచ్ శ్రీలత, ఎంపీటీసీ విజయ, తహసీల్దార్లు శ్రీనివాస్, సదానందం, సరిత, రాంరెడ్డి, జమ్మికుంట రూరల్ సీఐ సురేశ్, జమ్మికుంట నాయబ్ తహసీల్దార్ సమ్మయ్య, ఎస్ఐ తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, రాజిరెడ్డి, శ్రీరాం ఉన్నారు.
కల్యాణానికి తలంబ్రాలు సిద్ధం
సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు, సీతారామాచార్యులు, శ్రీనివాసాచార్యులు గ్రామ ఆలయంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. తహసీల్దార్ సురేఖ, వివిధ గ్రామాల మహిళలు తలాంబ్రాలను తీసుకువచ్చి కలిపారు. రాత్రి ఆలయం నుంచి వాయిద్యాల మధ్య పల్లకీలో ఊరేగింపుగా ఉత్సవమూర్తులకు బాహ్య మందిర ప్రవేశం కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత, ఈవో సుధాకర్, ఎస్ఐ తిరుపతి, ఆలయల సిబ్బంది ఉన్నారు.