కార్పొరేషన్, ఏప్రిల్ 8: కరీంనగర్‌ను దేశంలోనే పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. స్థానిక 9వ డివిజన్లోని శ్మశానవాటికలో శుక్రవారం ఆయన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం నగరపాలక సంస్థ ఇటీవల కొనుగోలు చేసిన స్వీపింగ్ యంత్రాలను మేయర్ వై సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి గంగుల విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. ప్రజలు పరిశుభ్ర వాతావరణంలో ఉండాలన్న ఆలోచనతోనే నగరంలో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపడుతున్నామన్నారు.
నగరంలోని రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు గతంలోనే డీఎంఎఫ్టీ నిధులతో 2 స్వీపింగ్ యంత్రాలను నగరపాలక సంస్థకు అందించామన్నారు. సఫాయి మిత్ర చాలెంజ్‌లో రెండో స్థానంలో నిలిచిన కరీంనగర్‌కు రూ.4 కోట్ల ప్రోత్సాహకం వచ్చిందన్నారు. ఈ నిధుల్లోంచి మరో రెండు స్వీపింగ్ యంత్రాలను రూ.1.64 కోట్లతో కొనుగోలు చేశామన్నారు. అలాగే, సుడా పరిధిలోనూ రోడ్లను శుభ్రం చేసేందుకు రెండు స్వీపింగ్ యంత్రాలను కొనుగోలు చేస్తామని తెలిపారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.